Asianet News TeluguAsianet News Telugu

`రంగమార్తాండ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ రూపొందించిన కొత్త సినిమా `రంగమార్తాండ`. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌ నటించిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా రేపు(బుధవారం) విడుదల అవుతుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

rangamarthanda movie review rating will krishna vamsi is back ?
Author
First Published Mar 21, 2023, 5:22 PM IST

క్రియేటివ్‌ డైరెక్టర్‌గా మంచి పేరుతెచ్చుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ. హ్యూమన్‌ ఎమోషన్స్ తో అద్భుతాలు చేసి, డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో వాహ్‌ అనిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో కొత్త ఒరవడి సృష్టించారు. అయితే కొంత కాలంగా ఆయన దర్శకుడిగా ఆయన సక్సెస్‌ కాలేకపోతున్నారు. వరుస పరాజయాల అనంతరం ఆయన ఇప్పుడు తనని తాను నిరూపించుకునేందుకు వస్తున్నారు. తాజాగా కృష్ణవంశీ `రంగమార్తాండ` సినిమాకి దర్శకత్వం వహించారు. మరాఠిలో విజయం సాధించిన `నటసామ్రాట్‌` చిత్రానికిది రీమేక్‌. తెలుగుదనాన్ని జోడించి, నేటి హ్యూమన్‌ ఎమోషన్స్ ని మేళవించి, సమకాలీన అంశాలను టచ్‌ చేస్తూ `రంగమార్తాండ` చిత్రాన్ని రూపొందించారు. ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రేపు బుధవారం(మార్చి 22)న ఉగాది పండుగ సందర్భంగా విడుదల కానుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః 

రంగమార్తాండ(ప్రకాష్‌ రాజ్‌). ఆయన పాపులర్‌ రంగస్థలం నటుడు. ఆయన, ఆయన భార్య శ్రీమతి రాజుగారు(రమ్యకృష్ణ) కనిపించకుండా పోయారని వాళ్ల కుమారుడు రంగరావు(ఆదర్శ్‌ బాలకృష్ణ), కోడలు గీతా రంగారావు(అనసూయ), కూతురు శ్రీ(శివాత్మిక రాజశేఖర్‌), అల్లుడు రాహుల్‌(రాహుల్‌ సిప్లిగంజ్‌) చాలా టెన్షన్‌ పడుతుంటారు. కట్‌ చేస్తే రంగమార్తాండ ఓ దాబాలో ప్లేట్లు కడుతూ, సర్వీస్‌ మేన్‌గా పనిచేస్తుంటాడు. అప్పుడే నాటకరంగానికి వేదికగా ఉన్న కళాభారతిలో అగ్నిప్రమాదం అనే వార్త వస్తుంది. అది చూసి తల్లడిల్లిపోయినా రంగమార్తాండ హుటాహుటిని ఆ కళాభారతికి చేరుకోవాలనుకుంటాడు. అందుకు హీరోగా పరిచయం అవుతున్న కొత్త నటుడు(అలీ రాజా) కారులో ఎక్కుతాడు. కాలి బూడిదైన కళాభారతిని చూసి తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. తనకు రంగమార్తాండ బిరుదు ఇస్తూ, బంగారు కంకణంతో సత్కరించిన రోజే నటనకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. ఫ్యామిలీతో శేష జీవితాన్ని గడపాలనుకుంటాడు. భార్య, కుమారుడు, కూతురు,స్నేహితులతో టైమ్‌ స్పెండ్‌ చేయాలనుకుంటాడు. 

రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే కుమారుడు, కూతురుకి ఆస్తి పంపకాలు చేస్తాడు. తమ పేరుమీద ఎలాంటి ఆస్తులు ఉంచుకోరు. వజ్రాల్లాంటి కొడుకు,కూతురు ఉన్నారు, ఆస్తి ఎందుకంటాడు. కోడలు పేరుమీద ఇంటి ఆస్తిని రాసి, కూతురుకి నగదు, ఆభరణాలు ఇస్తాడు. ఆమె ప్రేమించిన వాడి(రాహుల్‌ సిప్లిగంజ్‌)తో పెళ్లి కూడా చేస్తాడు. ప్రారంభంలో కొన్ని రోజులు బాగానే ఉంటుంది. నెమ్మదిగా కోడలితో గొడవలు ప్రారంభమవుతాయి. మామ చేసేవి కోడలికి, కోడలు చేసేవి మామకి నచ్చవు. దీంతో అక్కడి నుంచి కూతురు ఇంటికి వెళ్తారు. అక్కడ ఇలాంటి పరిస్థితే, దొంగ అనే ఆరోపణ వేస్తుంది కూతురు. దీంతో తట్టుకోలేకపోయిన రంగమార్తాండ తన భార్య శ్రీమతి రాజుగారు కోరిక మేరకు సొంతూరుకి వెళ్లిపోదామని నిర్ణయించుకుంటారు. మరి సొంతూరుకి వెళ్లారా? వెళ్లే క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? గొప్ప నటుడిగా వెలిగిన రంగమార్తాండ దాబాలో ప్లేట్లు ఎందుకు కడుతున్నాడు? ఆయనకు స్నేహితుడు సుబ్బు(బ్రహ్మానందం)తో ఉన్న సంబంధం ఏంటి? ఇటు కూతురితో, అటు కోడలితో రంగమార్తాండకి ఎందుకు గొడవలయ్యాయి? చివరికి ఆయన జర్నీ ఎలా సాగింది? నటకరంగానికి, ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటనేది మిగిలిన కథ. 

విశ్లేషణః 

రంగస్థలంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన రంగమార్తాండ రాఘవరావు అనే నటుడి జీవితాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. రంగస్థలం అనేది బ్యాక్‌ డ్రాప్‌గానే తీసుకున్నారు కానీ సినిమా ఆసాంతం ఫ్యామిలీ డ్రామాగా, హ్యూమన్‌ ఎమోషన్స్ తో, అనుబంధాల నేపథ్యంలోనే సాగుతుంది. నటన గొప్పతనం చెబుతూ, కుటుంబ అనుబంధాలు, నేటి ట్రెండ్స్ గురించి చెప్పారు. తల్లిదండ్రుల తరం, మనతరం, మన పిల్లల(భవిష్యత్‌) తరం అనే మూడు తరాల మనస్తత్వాలను, వారి అండర్‌స్టాండింగ్‌ని, టేస్ట్ ల గురించి, ఒకరి వల్ల ఒకరు ఎలా ఇబ్బంది పడుతున్నారనే అంశాలను దర్శకుడు కృష్ణవంశీ ఇందులో ఓపెన్‌గా చర్చించారు. డబ్బు ప్రభావం మనుషులపై ఎంతగా ఉంటుంది, డబ్బు ఎలాంటి గొడవలు పెడుతుందనే విషయాన్ని కూడా చర్చించారు దర్శకుడు. వర్ణ వివక్షని, నటుల ఎఫైర్లని కూడా ఓపెన్‌గా చెప్పేశాడు. మారుతున్న కాలం, దూరమవుతున్న అనుబంధాల గురించి, అటు కొడుకు కోడలు, ఇటు కూతురు కూడా అవమానిస్తే ఏకాకిగా మిగిలే పేరెంట్స్ జీవితాలను వారిలో కలిగే మానసిక సంఘర్షణని కళ్లకి కట్టినట్టు చూపించారు. ఇంకా చెప్పాలంటే నేటి సమాజాన్ని ఆవిష్కరించాడు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ.

నాటకాలకు సంబంధించిన స్టేజీపై ఎన్నో అద్బుతమైన పాత్రల్లో నటించి, పాత్రలకు జీవం పోసి, ఆ పాత్ర ఆత్మలను తనలోకి తీసుకుని అద్భుతంగా నటించి మెప్పించిన నటులు.. నిజ జీవితంలో నటించలేక, తమకి కలిగే భావాలను నియంత్రించుకోలేక, దాని వల్ల వచ్చే అనర్థాలు, అపార్థాలు, అవమానాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. ఆయా సన్నివేశాలు చూస్తుంటే, పాత్రల సంఘర్షణ చూస్తుంటే, ముఖ్యంగా రంగమార్తాండ, ఆయన చిన్ననాటి స్నేహితుడు, నాటకరంగ స్నేహితుడు సుబ్బు(బ్రహ్మానందం) మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి. ఆలోచింప చేస్తాయి. ఏడిపిస్తాయి. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రలోని సంఘర్షణ, ఆయన భార్య హఠాన్మరణంతో కుంగికృషించిపోతూ, ఒంటరిగా బతకలేక చివరి దశలో ఆయన పడే బాధ, వేదన, సంఘర్షణ ఆడియెన్స్ కళ్లల్లో ధారాళంగా కన్నీళ్లు తెప్పిస్తాయి. బ్రహ్మానందంలోని మరో కోణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరింప చేశాడు దర్శకుడు. ఆడియెన్స్ ని అత్యంతగా కదిలించే పాత్ర ఆయనది కావడం విశేషం. 

మొదటి భాగం ప్రారంభంలో రంగమార్తాండని వెతికే సన్నివేశాలు, ఆ తర్వాత.. రంగమార్తాండ నటనకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత తన ఫ్యామిలీతో జరిగే సంఘటనలను, వ్యక్తుల మనస్తత్వాలను తెలియజేసేలా సినిమా సాగుతుంది. కొంత సరదాగా, మరికొంత ఎమోషనల్‌గా, ఇంకొంత బోరింగ్‌గా సాగుతుంది. స్లో నెరేషన్‌ కాస్త ఇబ్బంది పెట్టే అంశం. మొదటి భాగంలో రంగమార్తాండ.. కోడలితో జరిగే గొడవలు, ఇంటర్వెల్‌ తర్వాత కూతురుతో వచ్చే మనస్పర్థలను చూపిస్తూ, `ఆనందం, రెండు విషాదల మధ్య విరామం అంటూ ఇంటర్వెల్‌` అదిరిపోయింది. సెకండాఫ్‌ మరింత స్లోగా మారిపోతుంది. దీంతో బోర్‌ తెప్పిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. మన జీవితాన్ని చూపిస్తుంటాయి. ఓ తండ్రి అయితే తన కొడుకు, కోడలు, కూతురితో పడే ఇబ్బందులు, కుమారుడు అయితే పేరెంట్స్ ని, భార్యని మేనేజ్‌ చేయలేక పడే ఇబ్బందులు కళ్ళకి కట్టినట్టుగా తెరపై ఆవిష్కృతం అవుతుంటాయి. 

కథగా ఈ సినిమా రెగ్యులర్‌ ఫ్యామిలీ డ్రామానే. కానీ దాన్ని చెప్పిన తీరు కొత్తగా ఉంటుంది. మనసుని హత్తుకునేలా, ఆలోచింప చేసేలా, హృదయాన్ని బరువెక్కించేలా ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కృష్ణవంశీ సక్సెస్‌ అయ్యారు. అయితే సినిమాలో ఇంకొంత ఫన్‌ పెడితే బాగుండేది. స్లో నెరేషన్‌ బోర్‌ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. కొన్ని చోట్ల ఆర్ట్ ఫిల్మ్ ని తలపిస్తుంది. ఆడియెన్స్ ఓపికని పరీక్షిస్తుంది. కానీ ఆయా పాత్రలు పడే బాధ మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది. సినిమాలోని ప్రతి డైలాగ్‌ అద్బుతంగా ఉంటుంది. హృదయాన్ని హత్తుకుంటుంది. మొత్తంగా స్లో, బోరింగ్‌ అంశాలను పక్కన పెడితే ఈ సినిమా ఓ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే రోలర్‌ కోస్టర్‌ గా చెప్పొచ్చు.  


నటీనటులుః 
రంగమార్తాండగా ప్రకాష్‌ రాజ్‌ నటన అద్భుతం. ఆయన జీవించాడు. పాత్రకి మరోసారి ప్రాణం పోశాడు. ఇలాంటి పాత్రలు పడితే ఆయన ఎంతగా రెచ్చిపోతారో మరోసారి నిరూపించారు. నవరసాల మేళవింపుగా ఆయన పాత్ర సాగడం విశేషం. బ్రహ్మానందం పాత్ర ఆడియెన్స్ కి సర్ప్రైజింగ్‌  అని చెప్పొచ్చు. ఆయన్నుంచి ఎవరూ ఇలాంటి పాత్రని ఊహించరు. కామెడీగా ఎంతగా కడుపుబ్బ నవ్వించారో, ఇందులో అంతగా ఏడిపించారు. వెయ్యికిపైగా చిత్రాల అనుభవం రంగరించి పోత పోస్తే ఇందులోని బ్రహ్మానందం నటించిన సుబ్బు పాత్ర అవుతుంది. సినిమాకి మెయిన్‌ హైలైట్‌గా ఆయన పాత్ర నిలుస్తుంది. మరోవైపు కవితలతో తమ భావాలను పలికించే విషయంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం పోటీపడ్డారు. సైలెంట్‌గా రమ్యకృష్ణ నటన మరోసారి వాహ్‌ అనిపించారు. కళ్లతోనే నటన పలికించి ఫిదా చేశారు. కూతురిగా శివాత్మిక నటన సైతం ఫిదా చేస్తుంది. కెరీర్‌ ప్రారంభంలోనే ఇంతటి నటన కనబర్చడం గొప్ప విషయంగా చెప్పొచ్చు. రాహుల్‌ పాత్రలో రాహుల్‌ సిప్లిగంజ్‌ ఫన్‌గా సాగుతూ అలరించాడు. కోడలిగా అనసూయ అదరగొట్టింది. యాప్ట్ గా నిలిచింది. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపిస్తాయి. `నేనొక నటుడిని` అంటూ చిరంజీవి చెప్పిన షాయరీ ప్రారంభంలో ఆకట్టుకుంటుంది.

టెక్నీషియన్లుః 
మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సినిమాకి పెద్ద బలం. బ్యాక్‌ బోన్‌ కూడా. పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది. కొన్ని సీన్లకి అసలు బీజీఎం లేకపోవడం కూడా హైలైట్‌గా నిలవడం విశేషం. ఆకెళ్ల శ్రీనివాస్‌ మాటలు సినిమాకి మరో బలం. `అక్షరాన్ని పొడిగా పలకకు... దాని వెనుక తడిని చూడు` వంటి అనేక బలమైన డైలాగులు ఆకట్టుకుంటాయి. దీంతోపాటు రాజ్‌ కె నల్లి సినిమాటోగ్రఫీ సైతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాలకు తగ్గట్టుగా, మూడ్‌కి తగ్గట్టుగా ఉంటూ కనువిందు చేస్తుంది. నిర్మాతలు రాజీపడకుండానే నిర్మించారు. దర్శకత్వం సినిమాకి పెద్ద అసెట్‌. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఆయన పాత్రలోని నటనని రాబట్టుకున్న తీరుకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. తాను చెప్పదలుచుకున్న విషయాలను స్పష్టంగా, క్లారిటీగా చెప్పాడు. `మాకు దక్కిన అవార్డులు, రివార్డుల కంటే ఎఫైర్లే ఎక్కువ` అని నటుడి జీవితాన్ని అంత నగ్నంగా చెప్పడం మామూలు విషయం కాదు.  అయితే ఎమోషనల్‌ మూవీగా సినిమా తెరకెక్కించిన తీరు బాగుంది కానీ, దాన్ని మరింత ఎంటర్‌టైనింగ్‌ వేలో చెబితే బాగుండేది. నేటి యువతరానికి కావాల్సిన అంశాలను మరిన్ని జోడించాల్సి ఉంది. 

ఫైనల్‌గాః ఫ్యామిలీ డ్రామాని కొత్తగా ఆవిష్కరించిన చిత్రం. ఓ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌. ఓపికతో చూస్తే హృదయాన్ని కదిలించే సినిమా అవుతుంది.

రేటింగ్‌ః 3

నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా, సత్యానంద్ తదితరులు.
మాటలు : ఆకెళ్ళ శ్రీనివాస్
ఛాయాగ్రహణం : రాజ్ కె. నల్లి 
సంగీతం : ఇళయరాజా 
నిర్మాత‌లు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం : కృష్ణవంశీ

Follow Us:
Download App:
  • android
  • ios