దగ్గుబాటివారి నటవారసుడు రానా నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు భాషల్లో నటిస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ప్రేయసి మిహికా బజాజ్ ని వివాహం చేసుకొని ఓ ఇంటి వాడయ్యాడు. రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య విడుదలకు సిద్ధంగా ఉంది.  కాగా ఆహా యాప్ కోసం అక్కినేని సమంత నిర్వహిస్తున్న సామ్ జామ్ ప్రోగ్రాంకి గెస్ట్ గా విచ్చేశారు రానా. దర్శకుడు నాగ్ అశ్విన్ తో పాటు, ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

ఈ టాక్ షోలో రానా తన ఆరోగ్యంపై కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. రానా కొన్నాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఆ సమయంలో రానా ఆరోగ్యం పాడైందని, అతని కిడ్నీలు పాడవడంతో వైద్యం కోసం అమెరికా వెళ్లారని వార్తలు వచ్చాయి. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత రానా లుక్ చూసిన వారు ఆ కథనాలు నిజమే అని నమ్మారు. కండల శరీరంతో ఫిట్ గా ఉండే రానా బక్క పలచగా మారిపోయారు. 

ఇక సామ్ జామ్ ప్రోగ్రాం లో సమంత ఇదే విషయం అడిగారు. రానా స్పందిస్తూ...హ్యాపీగా ముందుకు సాగుతున్న జీవితంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వచ్చిందని అన్నారు.  చిన్నప్పటి  నుంచి తనకు బీపీ ఉందని, దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుతుందని రానా అన్నాడు. ''నీ కిడ్నీలు కూడా పాడవుతాయి. స్ట్రోక్ హెమరేజ్‌కు 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంది' అని వైద్యులు చెప్పారన్నాడు. ఈ విషయం చెప్పే క్రమంలో రానా కంటతడి పెట్టుకున్నాడు. వెంటనే సమంత స్పందిస్తూ 'మీ చుట్టు జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారని అన్నారు. రానా ఆరోగ్యం గురించి తెలిసిన ఆడియన్స్ సైతం కంట నీరు పెట్టారు.