`భళ్లాలదేవ` రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. నక్సల్‌ ప్రధానంగా సాగే లవ్‌ స్టోరీ ఇది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సాయిపల్లవి, నివేదా పేతురాజ్‌, ప్రియమణి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

ఇప్పటికే `విరాటపర్వం` సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌, సాయిపల్లవి, ప్రియమణి పాత్ర లుక్‌లు విడుదల చేశారు. త్వరలో మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడు రానా. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. ఈ నెల 14న రానా బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్టు శనివారం ప్రకటించారు. 

సోమవారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు `విరాటపర్వం` చిత్రంలోని రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్‌ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రానా ఓ నక్సల్‌ పాత్రలో కనిపించనున్నట్టు, అలాగే ప్రేమ, తిరుగుబాటు ప్రధానంగా సినిమా సాగనుందని, పీరియాడికల్‌గా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం.