టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా అకౌంట్ లో బాబాయ్ వెంకటేష్ కి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేశారు. హీరోయిన్ ఖుష్బూతో కలిసి వెంకటేష్ ఉన్న ఫోటో అది. ఈ ఫోటో 'కలియుగపాండవులు' సినిమాలోనిది. రానా ఈ ఫోటోని అభిమానులతో పంచుకోవడానికి స్పెషల్ రీజన్ ఉంది.

వెంకీ సినీ ప్రస్థానం మొదలుపెట్టి నేటికి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయింది. వెంకీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సినిమా 'కలియుగ పాండవులు'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాను రామానాయుడు స్వయంగా నిర్మించారు.

1986 ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. మొదటి సినిమాతోనే వెంకీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ తరువాత నుండి అతడి కెరీర్ దూసుకుపోయింది. వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది 'ఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న ఆయన ప్రస్తుతం 'వెంకీమామ' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా మరో హీరోగా కనిపించనున్నారు. పాయల్ రాజ్ పుత్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.