ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన రమ్యకృష్ణ ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. 'బాహుబలి' సినిమా ఆమె క్రేజ్ ని అమాంతం పెంచేసింది. దీంతో ఇండస్ట్రీలో రమ్యకృష్ణకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. అమ్మ రోల్స్, అత్త రోల్స్ కోసం రమ్యకృష్ణని ఎంపిక చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆమె నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇలాంటి పాత్రల్లో కూడా రమ్యకృష్ణకి కొంత పోటీ ఉందనే చెప్పాలి. నదియా లాంటి సీనియర్ తారలు అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు. కానీ బాహుబలి సినిమా తెచ్చిన క్రేజ్ తో దర్శకనిర్మాతలు రమ్యకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నారు. 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా గనుక హిట్ అయితే ఇక రమ్యకృష్ణకి తిరుగుండదు.

పారితోషికం విషయంలో కూడా ఆమె టాప్ హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోందని తెలుస్తోంది. రోజువారీ డేట్స్ కాటాయిస్తే ఒక్కో రోజుకి ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అదే ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తే ఒక్కో సినిమాకు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం లీడ్ లో ఉన్న హీరోయిన్లతో పోలిస్తే ఈమె పారితోషికం చాలా ఎక్కువనే చెప్పాలి!