Asianet News TeluguAsianet News Telugu

జయలలిత పాత్రే నా డ్రీమ్ రోల్ అంటున్న శివగామి

  • జయలలిత పాత్రలో రమ్యకృష్ణ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్
  • తనకూ అమ్మ పాత్రలో నటించడం డ్రీమ్ రోల్ అని చెప్పిన రమ్య
ramyakrishna dream role amma jayalalitha

మహానటిగా, మహోన్నత రాజకీయనాయకురాలిగా తమిళ ప్రజల గుండెల్లో దేవతగా, అమ్మగా కొలువైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం పూల పానుపేం కాదు. అమ్మ జీవితంలోనూ ఆటుపోట్లు ఎన్నో. అయితే అలుపెరగని పోరాటం చేసి గెలిచి నిలిచింది. చివరి మజిలీలోనూ ఓడినా గెలిచింది. మరణించిన తర్వాత కాలగర్భంలో కలిసే అందరిలా కాదు అమ్మ జీవితం. పోయాక కూడా ఇక్కడే సజీవంగా ఉన్నారనిపించుకునే అతి కొద్ది మందిలో జయలలిత ఒకరు.

 

అలాంటి అమ్మ రూపంలో మేటి నటి రమ్యకృష్ణ సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మదర్‌ ది స్టోరీ ఆఫ్‌ ఏ క్వీన్  టాగ్‌తో రూపొందించిన అమ్మగా రమ్యకృష్ణ ఊహాజనిత చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హైలైట్ టాపిక్. ఇంతకీ అమ్మకు, రమ్యకు ఏంటి సంబంధం..అదే సినిమా బంధం.

 

అమ్మగా కీర్తి పొందిన తమిళ రాజకీయ రారాణి జయలలిత జీవిత చరిత్రను వెండి తెరకెక్కించాలన్న ఆసక్తి పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి ఉంది. అలాగే అమ్మగా నటించాలన్న ఆకాంక్ష అగ్రనాయికలైన పలువురిలో ఉంది. జయలలిత రూపంలో నటి రమ్యకృష్ణ ఊహా చిత్రం సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తున్న విషయం గురించి ఆ గ్రేట్‌ నటి ముందుంచగా చాలా ఎమోషనల్‌గా స్పందించారు.

తన స్నేహితులు ఆ ఫొటోను వాట్సాప్‌ ద్వారా తనకు పంపించారన్నారు. అది పూర్తిగా అభిమానుల ఆకాంక్షగా రమ్య పేర్కొన్నారు. అయితే తనను చాలా సార్లు, చాలామంది పత్రికా విలేకరులు మీ డ్రీమ్‌ రోల్‌ ఏమిటని అడిగినా అందుకు సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే ఇప్పుడు ఆ ఊహా చిత్రం చూసిన తరువాత జయలలితగా నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇదే తన డ్రీమ్‌ రోల్‌ అని పేర్కొన్నారు. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నానని, అయితే ఆ పాత్రలో జీవించడం చాలా చాలెంజ్‌తో కూ డుకున్నదని అన్నారు. అందువల్ల అలాంటి పాత్రను అంత సులభంగా అంగీకరించలేనన్నారు.

 

కానీ స్క్రిప్ట్‌ పక్కాగా ఉండి, సమర్థులైన  దర్శక నిర్మాతలు చిత్ర నిర్మాణానికి పూనుకుంటే... వాళ్లు తనను సంప్రదిస్తే తాను అమ్మగా నటించడానికి సిద్ధం అని రమ్యకృష్ణ పేర్కొన్నట్లు సమాచారం. తనతో పాటు కోట్లాది మంది మహిళామణులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ధృఢమైన వ్యక్తిత్వం గల అమ్మ జయలలిత అని రమ్యకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అభిమాని ఊహాచిత్రం వెండితెరపై నిజం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శశికళ పేరుతో చిత్రాన్ని రూపొందించడానికి సన్నద్ధం అవుతున్నారు. అందులో అమ్మ పాత్ర ప్రధానంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నిజ వ్యక్తుల రూపాలను వెండితెరపై అచ్చు గుద్దినట్లు చూపించగల వర్మ శశికళ చిత్రంలో ఎవరిని ఆ విధంగా మార్చనున్నారో వెయిట్‌ అండ్‌ సీ.

 

Follow Us:
Download App:
  • android
  • ios