నటి రమ్యకృష్ణ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. రిచ్ గర్ల్ గా, మధ్య తరగతి ఇల్లాలిగా, పొగరుబోతు అమ్మాయిగా ఇలా ఒకటా, రెండా చాలానే చేశారు. 'బాహుబలి'లో శివగామిగా మెప్పించిన ఈమె ఇప్పుడు వేశ్య పాత్రలో నటిస్తోంది.

రమ్యకృష్ణ వేశ్య పాత్రలో నటిస్తుందని తెలిసిన వెంటనే అభిమానులు షాక్ అయ్యారు. కానీ తను మాత్రం ఎంతో ఇష్టంతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజ రూపొందిస్తోన్న 'సూపర్ డీలక్స్' సినిమాలో విజయ్ సేతుపతి స్వలింగ సంపర్కుడి పాత్రలో నటిస్తుండగా, రమ్యకృష్ణ శృంగారతారగా నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రమ్యకృష్ణ. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలు ఒక ఎత్తైతే.. ఈ పాత్ర మరో ఎత్తని చెప్పింది. సినిమాలో ఓ సన్నివేశంలో నటించడానికి 37 టేకులు తీసుకున్నానని, ఆ సీన్ పూర్తి చేయడానికి రెండు రోజులు పట్టినట్లు వెల్లడించింది.

అది చూసి సెట్ లో ఉన్నవారు షాక్ అయినట్లు తెలిపింది. కొన్ని సినిమాలు డబ్బు కోసం చేస్తామని, మరికొన్ని పాపులారిటీ, పేరు కోసం చేస్తామని కొన్ని మాత్రం ఇష్టంతో చేస్తామని.. ఈ సినిమా ఇష్టంతో చేసినట్లు వెల్లడించింది. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.