దుబాయ్‌లో ఇటీవల మృతి చెందిన నటి శ్రీదేవిపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బయోపిక్ తీయనున్నాడనే వార్త మీడియాలో గత రెండు రోజుల నుంచి హల్‌చల్ చేస్తోంది. అయితే.. అవన్నీ పుకార్లేనని.. శ్రీదేవిపై బయోపిక్‌ తీసే ఉద్దేశం తనకి లేదని రామ్‌గోపాల్ వర్మ శనివారం ట్వీట్ చేశాడు. శ్రీదేవిని అమితంగా ఆరాధించే వర్మ.. బాహాటంగానే చాలా సందర్భాల్లో ఆమెపై తనకున్న అభిమానాన్ని వెల్లడించాడు.‘శ్రీదేవి బయోపిక్‌ను తాను తీయబోతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. అందులో నిజం లేదు. అలా తీయాలనుకోవడం కూడా అవివేకమని నా నమ్మకం. ఎందుకంటే.. శ్రీదేవి పాత్రని తెరపై సమర్థంగా పోషించే నటి ఎవరూ లేరు’ అని వర్మ ట్వీట్ చేశాడు. ప్రముఖుల బయోపిక్‌లు తీయడంలో రామ్‌గోపాల్ వర్మది అందివేసిన చేయి. ఇప్పటికే కొంత మంది బయోపిక్‌లపై వర్మ కసరత్తులు చేస్తున్నాడు. గతంలో తీసిన ‘రక్తచరిత్ర’ విజయవంతమైన విషయం తెలిసిందే.