సిట్ విచారణ తీరుపై మళ్లీ రామ్ గోపాల్ వర్మ అసహనం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందన్న వర్మ అకున్ సభర్వాల్ నేతృత్వంలోని సిట్ విచారణ నిరుపయోగమేనన్న వర్మ

డ్రగ్స్‌ కేసు విచారణలో ఎక్సైజ్‌ సిట్‌ తీరును తప్పుపడుతున్న డైరెక్టర్‌ రామగోపాల్‌ వర్మ మరోసారి ఫైర్‌ అయ్యారు. ఫేస్‌బుక్‌లో వరుస పోస్టింగులు పెట్టి విరుచుకుపడ్డారు. ఈ కేసు తీవ్రత ఎలా ఉన్నా హైదరాబాద్‌ ప్రతిష్టను మాత్రం దెబ్బతీస్తోందని.. హైదరాబాద్‌ ఇంత బ్యాడా అంటూ ముంబై ప్రజలు తనను అడుగుతున్నారని అన్నాడు. కొంత మందినే టార్గెట్‌ చేసి జాతీయ స్థాయిలో డ్రామా నడపడం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ కూడా మసక బారుతుందనేది తన అభిప్రాయంగా చెప్పాడు వర్మ. 


అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలోని సిట్‌ నిర్వహిస్తున్న విచారణ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారని ...కాకపోతే తెలంగాణకు చెడ్డ పేరు వస్తోందని తెలిపాడు. పంజాబ్‌ కన్నా తెలంగాణ ఇంత దారుణమా అని ముంబై ప్రజలు అనుకుంటున్నారని ఫేస్‌బుక్‌లో వివరించాడు వర్మ. 


కేసీఆర్‌ను అనేక విషయాల్లో ముంబై ప్రజలు మెచ్చుకుంటారని...కానీ బాలీవుడ్‌లోనూ ముంబైలోనూ పంజాబ్‌ స్కూల్స్‌లోనూ జరగని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో జరుగుతుండటం చూసి షాక్‌ అవుతున్నారన్నాడు డైరెక్టర్‌ వర్మ. దేశ ప్రజల దృష్టిలో కేసిఆర్‌, తెలంగాణల ప్రతిష్టలు మసకబారకుండా బాధ్యత కలిగిన అకున్‌సబర్వాల్‌, చంద్రవదన్‌లు ప్రవర్తిస్తారని ఒక హైదరాబాదీగా కోరుకుంటున్నానని అన్నాడు. సరైన మార్గంలో సిట్‌ తప్పులను గుర్తిస్తుందని ఆశిస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో తన కామెంట్‌ను పోస్ట్‌ చేశాడు. 

బహుబలి సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని డైరెక్టర్‌ రాజమౌళి ఎంతో పెంచాడని ముంబై ప్రజలు అనుకుంటుంటుండగా... అకున్‌ సబర్వాల్‌ అతని బృందం కలిసి దేశం దృష్టిలో తెలుగు రాష్ట్రాలను తలదించుకునేలా చేశాయని వ్యాఖ్యానించాడు వర్మ. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో సమర్థవంతమైనా పాలన అందిస్తోందని భావించే ముంబై ప్రజలు....దేశంలో ఏ స్కూల్లో లేని విధంగా తెలంగాణలోని స్కూళ్లలో స్టూడెంట్స్‌ డ్రగ్స్‌ వాడుతున్నారని తెలిసి షాకయ్యారని అన్నారు. అందుకే సిట్‌ను సరిగా సెట్‌ చేయాలని కామెంట్‌ చేశారు వర్మ.


తెలంగాణ రాష్ట్రం, టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ గురంచి ఎంతో మంచి విషయాలను ముంబై ప్రజలు ఇప్పటి వరకూ తెలుసుకున్నారని..కానీ వారి విషయంలో రకరకాలు అనుకునే విధంగా పరిస్థితి మార్చేసిన సిట్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నట్టు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు వర్మ. ఇప్పటికైనా హైదరాబాద్‌, టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ ప్రతిష్ట దెబ్బతినకుండా ప్రవర్తించాలని సిట్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్టు తన కామెంట్‌ను పోస్ట్‌ చేశాడు. బాహుబలి 2 తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఎంతో పెంపొందిస్తే.. డ్రగ్స్‌ కేసు దానిని దిగజార్చిందని వ్యాఖ్యానించాడు వర్మ.