అత్యంత ఖరీదైన భారతీయ సినిమాగా రామాయణం గుర్తింపు పొందబోతోంది. హాలీవుడ్ సినిమాల భారీ బడ్జెట్ ను మించిపోయి ఇప్పుడు రామాయణం సిద్ధమవుతోంది. ఇది మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డు సాధించబోతోంది.
ప్రపంచ సినీ రంగంలో భారతీయ సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా చేసేలా రామాయణం సినిమా సిద్ధమవుతోంది. రామాయణాన్ని రెండు పార్టులుగా విడదీసి చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి మొదటి పార్టును విడుదల చేయబోతున్నారు. 2027లో రెండో పార్ట్ రాబోతోంది. ఒక్కో పార్ట్ రామాయణం మూవీని నిర్మించడానికి 2,000 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. అంటే రెండు సినిమాలకు కలిపి నాలుగు వేల కోట్ల రూపాయలు. ఇలా ఒక్క సినిమాకే 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సాధారణ విషయం కాదు. హాలీవుడ్లో సూపర్ మ్యాన్, జురాసిక్ వరల్డ్ వంటి సినిమాలకు కూడా ఇంత ఖర్చు అవ్వలేదు. అందుకే అత్యంత ఖరీదైన భారతీయ సినిమాగా రామాయణ చరిత్రలో నిలిచిపోతుంది.

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. రామాయణం ఒక భారతీయ సినిమాగా కాకుండా ప్రపంచ స్థాయి సినిమాగా నిలబడాలన్న ఉద్దేశంతోనే తాము ఆ సినిమాను నిర్మిస్తున్నామని చెప్పారు. కేవలం భారతీయ ప్రేక్షకులనే కాదు ప్రపంచ స్థాయి సినీ ప్రేక్షకులందరికీ అలరించే విధంగా ఈ సినిమా నిర్మించాలని తమ లక్ష్యంగా పెట్టుకున్నట్టు అన్నారు.
భారీ బడ్జెట్ సినిమా ఇది
ప్రారంభంలో ఈ సినిమాను 1600 కోట్ల రూపాయలతో నిర్మించాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయాన్ని నమిత్ మల్హోత్రా ఖండిస్తున్నారు. మొదటి నుంచి కూడా సినిమా బడ్జెట్ 4,000 కోట్ల రూపాయలకు పైగానే ఉందని, రెండు సినిమాలుకు కలిపి ఈ మొత్తం అవుతుందని ఆయన వివరించారు. ఈ సినిమాను నమిత్ మల్హోత్రాతో పాటు మరొక నాలుగు కంపెనీలు కలిపి నిర్మిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కోసం బ్రిటిష్ ఇండియన్స్ స్టూడియో పనిచేస్తోంది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అందించేందుకు ఏఆర్ రెహమాన్ తో పాటు, హాలీవుడ్ సంగీత కర్త అయిన హాన్స్ జిమ్మెర్ కూడా పనిచేస్తున్నారు. మొదటి పార్ట్ ను దీపావళి సందర్భంగా 2026లో విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు.

రామాయణం నటీనటులు వీరే
రామాయణం మూవీలో ఎంతోమంది సీనియర్ టాలెంటెడ్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు. రాముడిగా, పరశురాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించబోతున్నారు. ఇక లక్ష్మణుడుగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, జటాయువుగా అమితాబచ్చన్, కైకేయిగా లారా దత్తా, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
రామాయణం స్క్రిప్ట్ ను రెడీ చేయడానికే మూడేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ సినిమాను హిందీతో పాటు ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఒడియా, సింహాలీ భాషలలో విడుదల చేయబోతున్నారు.

రావణుడిగా కన్నడ టాప్ హీరో అయినా యష్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాను అన్ని భాషల్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. కాబట్టి అందరికీ తెలిసిన నటీనటుల్ని ఈ సినిమాలో ప్రత్యేకంగా తీసుకున్నారు. రామాయణం అనేది ఉత్తరదేశం, దక్షిణ భారతదేశం అని కాదు.. దేశాన్ని ఏకం చేసే సినిమా అని చెబుతున్నారు నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ 2024లోనే ప్రారంభమైంది. ఇప్పటికే కొన్నిసార్లు సినిమా సెట్ చిత్రాలు కూడా లీక్ అయ్యాయి. పార్ట్ వన్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ఈ ఏడాది పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలుపెట్టారు. సినిమాలో ముఖ్యంగా విజిబుల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.
రామాయణం కథ అందరికీ తెలిసిందే... దాన్ని ప్రజలకు నచ్చేలా మరింత కొత్తగా తీస్తేనే ఎక్కువమంది సినిమాను చూస్తారు. తారాగణాన్ని భారీగా తీసుకోవడంతోపాటు సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రజలను ఆకర్షించేలా ఈ సినిమాను నిర్మించాలని భావిస్తోంది నిర్మాతలు.

సాయి పల్లవి సీత పాత్రకు న్యాయం చేస్తుందని ఆమె అభిమానులు నమ్ముతున్నారు. రాముడి గారు రణబీర్ కపూర్ ను ఎంపిక చేయడంపై అక్కడక్కడ కొన్ని వ్యతిరేక వాదనలు వినిపించాయి. అతడు మాంసాహారి అని, ముఖ్యంగా బీఫ్ తింటాడని అలాంటి వ్యక్తిని రాముడిగా ఎందుకు ఎంపిక చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతానికి ఎలాంటి ఆటకం లేకుండా రామాయణం మూవీ షూటింగ్ జరుగుతోంది.
