రామ్ హీరోగా నటించిన `ది వారియర్` సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోన్న నేపథ్యంలో రిజల్ట్ పై హీరో రామ్ స్పందించారు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా నటించిన చిత్రం `ది వారియర్`(The Warrior). యంగ్ క్రేజీ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. తమిళ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళంలో రూపొందించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ సినిమా గురువారం(జులై 14)న విడుదలైంది. సినిమాకి తొలిరోజు ఎనిమిదన్న కోట్ల కలెక్షన్లు సాధించింది. ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా `ది వారియర్` రిజల్ట్ పై హీరో రామ్ స్పందించారు. ఆడియెన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాకి వస్తోన్న స్పందనని దృష్టిలో పెట్టుకుని యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు పెంచారు. శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ని (The Warrior Success Meet) నిర్వహించారు. ఇందులో రామ్ మాట్లాడుతూ, ఆడియెన్స్ ని వారియర్స్ గా వర్ణించారు. ఇంతటి కఠినమైన టైమ్‌లోనూ సినిమాని చూసేందుకు థియేటర్ కి ఆడియెన్స్ రావడం గొప్పవిషయమన్నారు. అయితే మొదట వర్షం, కరోనా, రిలీజ్‌కి ముందు లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒక అడ్డంకి వస్తుందని, వర్షాల కారణంగా సినిమాని విడుదల చేయాలా? వద్దా అని ఆలోచించారట.
కరోనా వచ్చినా, వర్షాలు వచ్చినా ఆడియెన్స్ కి థియేటర్‌కి వస్తున్నారని, తెలుగు ఆడియెన్స్ సినిమా లవర్స్ అని నిరూపించుకున్నారని, తమ సినిమాకి వాళ్లే వారియర్స్ గా నిలబడ్డారని తెలిపారు రామ్. `మేం గట్టిగా నమ్మాం. ప్రేక్షకులు వస్తారని అనుకున్నాం. ఫస్ట్ డే అదే ప్రూవ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొంత మంది ప్రేక్షకులు సినిమా చూడలేకపోయారు. వాళ్ళందరూ కూడా సినిమా చూడాలని కోరుకుంటున్నా` అని చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాతలకు, దర్శకుడు లింగుస్వామి, కృతి శెట్టికి ధన్యవాదాలు తెలిపారు రామ్.
ఈ సందర్భంగా దర్శకుడు లింగుస్వామి చెబుతూ, తన తొలి తెలుగు సినిమాకి రామ్ లాంటి హీరో, ఆదిపినిశెట్టి, కృతి శెట్టి లాంటి నటీనటులు, శ్రీనివాసా చిట్టూరి వంటి నిర్మాతలు దొరకడం తన అదృష్టమన్నారు. `పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో అలా `ది వారియర్` సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించిందన్నారు. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నానని, ఆడియెన్స్ ప్రేమకి ధన్యవాదాలు చెప్పారు లింగుస్వామి.
కృతి శెట్టి(Krithi Shetty) మాట్లాడుతూ, `డాక్టర్లలో ఒక క్యూట్ నెస్ ఉంటుంది. వాళ్ళు ప్యూర్. ఆ క్యూట్ నెస్ ని సినిమాలో రామ్ బాగా క్యారీ చేశారు. పోలీస్ లో ఉన్న పర్ఫెక్షన్ కూడా బాగా క్యారీ చేశారు. ఆయనతో నటించడం బావుంది. గురు పాత్రలో ఆది పినిశెట్టిని తప్ప ఇంకొకరిని ఊహించలేం. లింగుస్వామి గారికి థాంక్స్` చెప్పింది కృతి. `పక్కా కమర్షియల్ సినిమాలు ఏమేం కావాలో అవన్నీ 'ది వారియర్'లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బావుందని అంటున్నారు. గురు పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం గురు లింగుస్వామి` అని ఆదిపినిశెట్టి చెప్పారు. ఇందులో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, ఫైట్ మాస్టర్ విజయ్, కళా దర్శకుడు డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
