వివాదాస్పద దర్శకుడ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇంత వరకు ఏపీలో విడుదలకు నోచుకోలేదు. ఈ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని టిడిపి నేతలు కేసు వేయడంతో కోర్టు విడుదలపై స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీలో విడుదలకు సిద్ధం అవుతోంది. శుక్రవారం మే 31న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు ఆర్జీవీ, నిర్మాత రాకేష్ రెడ్డి బుధవారం రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. 

అనంతరం ఆర్జీవీ మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే కొత్త సీఎం జగన్ ని వెంకటేశ్వర స్వామి గుడిలో కలుసుకున్నాన్ని, తమ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఇది శుభ సూచకమని వర్మ తెలిపాడు. గురువారం రోజు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనితో జగన్ నేడు తిరుమలలో పర్యటించి శ్రీవారిని దర్శించుకున్నారు. 

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తాను, నిర్మాత రాకేష్ రెడ్డి జగన్ ని కలుస్తామని ఆర్జీవీ తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ స్పెషల్ షోకు ఆయన్ని ఆహ్వానించనున్నట్లు కూడా వర్మ తెలిపాడు. వర్మ కోరికని జగన్ మన్నిస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం జగన్ అనేక కార్యక్రమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూసే సమయం ఉండకపోవచ్చు.