దేశానికి అన్నం పెట్టే రైతులపై సినిమాలు తీయమని వర్మని అడిగితే ఏం అన్నాడో తెలుసా..? 'నాకు రైతులంటే చిరాకు.. మట్టి అంటే అసహ్యం అందుకే రైతులపై సినిమాలు తీయను' అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో మరోసారి వర్మ వార్తల్లో నిలిచాడు.

ఇటీవల ఓ టీవీ చర్చావేదికలో పాల్గొన్న వర్మని సామాజిక కార్యకర్త 'దేశానికి ఉపయోగపడే సినిమాలు తీయొచ్చు కదా' అని ప్రశ్నించింది. దీనికి వర్మ.. 'దేశానికి ఉపయోగపడే సినిమాలా..? అవేంటో నువ్వే చెప్పు తీస్తా' అన్నాడు. దానికి ఆమె 'నిరుద్యోగ సమస్యలు,రైతులు పంటలు పడక, ప్రభుత్వ సహాయం లభించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుపై సినిమాలు తీయండి. అప్పుడు మీ సినిమాలను ఆదరిస్తామని' చెప్పింది.

దానికి వర్మ 'సరే నువ్వు చెప్పినట్లు సినిమా తీస్తా.. నువ్వు నిర్మాతగా చేస్తావా..?'ప్రశ్నించాడు. ఇంతలో యాంకర్ కల్పించుకొని 'వర్మ గారు.. మీ సినిమాలకు ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు ఉంది. మీరు రైతులపై సినిమా తీస్తే.. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వారవుతారు' అని చెప్పడంతో దానికి వర్మ సమాధానంగా.. ''నాకు రైతులంటే చిరాకు, వాళ్లు ఎప్పుడూ మట్టిలోనే ఉంటారు. నాకు మట్టి అంటే అసహ్యం. అందుకే రైతులపై సినిమాలు తీయను. నాకు ఎప్పుడూ గన్ లు, కత్తులు ఇవంటేనే ఇష్టం. వాటిపైనే సినిమాలు తీస్తా.. ఒకవేళ రైతులు తుపాకులు, కత్తులు పట్టుకుంటే అప్పుడు ఆలోచిస్తా'' అంటూ వెటకారంగా స్పందించారు.