Asianet News TeluguAsianet News Telugu

'వ్యూహం' మూవీ రిలీజ్ కి సెన్సార్ షాక్.. నారా లోకేష్ పై ఆర్జీవీ డౌట్, అప్పుడు కూడా ఇలాగే చేశా..ఆపగలిగారా

నవంబర్ 10న రిలీజ్ కావలసిన వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వ్యూహం చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Ram gopal varma reacts on Vyooham movie censor rejection dtr
Author
First Published Nov 3, 2023, 8:10 AM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ చిత్రాలకి వివాదాలు జోడించి ఆసక్తి పెంచడంలో వర్మ స్టయిలే వేరు. 

వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం నవంబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ పై కూడా విమర్శలు ఎదురయ్యాయి. స్పష్టంగా రాంగోపాల్ వర్మ జగన్ ని హైలైట్ చేస్తూ ప్రతిపక్ష నాయకులని కించపరిచే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారనే విమర్శలు మొదలయ్యాయి. 

అయితే నవంబర్ 10న రిలీజ్ కావలసిన వ్యూహం చిత్రానికి సెన్సార్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వ్యూహం చిత్రానికి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనితో వ్యూహం మూవీ రిలీజ్ సందిగ్ధంలో పడింది. ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ పై అనుమానాలు పెరిగాయి. వ్యూహం చిత్రం పొలిటికల్ అజెండాతో తెరకెక్కుతోంది అని ముందు నుంచి విమర్శలు ఉన్నాయి. 

ఇప్పుడు సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికెట్ నిరాకరించడంతో ఆర్జీవీ నెక్స్ట్ స్టెప్ ఏంటనే ఆసక్తి పెరుగుతోంది. అయితే వర్మ వ్యూహం సెన్సార్ పై మీడియాతో మాట్లాడుతూ.. వ్యూహం చిత్రం ఆగిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలో అసత్య ప్రచారాలు మొదలవుతున్నాయి. సెన్సార్ వాళ్ళు ఈ చిత్రాన్ని రివైజ్ కమిటీకి పంపారు. అంతే కానీ ఆగిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. 

రివైజింగ్ కమిటీకి పంపారు కాబట్టి నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన వ్యూహం చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం అని ఆర్జీవీ ప్రకటించారు. అయితే సెన్సార్ బోర్టు నిర్ణయం పై వర్మ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఇందులో నారా లోకేష్ హస్తం ఉన్నట్లుగా కూడా వర్మ అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ చిత్రాన్ని ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు మాత్రం చెప్పలేదు. వ్యూహం చిత్రాన్ని అడ్డుకోవాలని నారా లోకేష్ సెన్సార్ బోర్డుకి లేఖ రాసినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర లేవని వర్మ అన్నారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమరాజ్యంలో కడప బిడ్డలు లాంటి చిత్రాలు చేశాను. ఎలాంటి అడ్డంకులు రాలేదు. బాలీవుడ్ లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ చిత్రం వచ్చింది.. ఎవరైనా అడ్డుకోగలిగారా అని వర్మ ప్రశ్నించారు. 

సెన్సార్ బోర్డు అనేది అవుట్ డేటెడ్ సిస్టం అంటూ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. కంటెంట్ చూడకుండా అడ్డుకోగలుగుతున్నారా అని వర్మ అన్నారు. సినిమాని అడ్డుకునే పవర్ సెన్సార్ కి లేదు అని కోర్టులే చెబుతున్నాయి. కాకపోతే సినిమా సమాజంపై కొన్ని అంశాలలో ప్రభావం చూపకుండా చూసుకోవాలి.. అదే సెన్సార్ పని. వ్యక్తులపై, సమస్యలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చు అని వర్మ అన్నారు. రివైజింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానినిబట్టి తమ నెక్స్ట్ స్టెప్ ఉంటుందని వర్మ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios