సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ యమా స్పీడు మీద ఉన్నాడు. కరోనా కారణంగా ఇండస్ట్రీ అంతా స్తంబించిపోయిన సంగతి తెలిసింది. తిరిగి కార్యకలాపాలు ఎలా ప్రారంభిచాలని సినీ పెద్దలు తలమునకలవుతుంటే వర్మ మాత్రం వరుసగా సినిమాలను ప్రకటించేస్తున్నాడు. వెండితెర మీద ఎన్నో సంచలనాలకు కారణమైన వర్మ, ఇప్పుడు ఓటీటీల విషయంలో కూడా అదే ఫాం చూపిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్లు ఓటీటీలు వైపు అడుగులు వేయాలా వద్దా అని ఆలోచిస్తుండగానే వర్మ ఓటీటీలో జెండా పాతేశాడు.

చాలా రోజుల క్రితమే ఆన్‌లైన్‌ ద్వారా జీఎస్టీ అనే వివాదాస్పద చిత్రాన్ని రిలీజ్ చేసిన వర్మ తాజాగా లాక్‌ డౌన్ సమయంలో వరుసగా ఓటీటీ రిలీజ్‌లు చేస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్‌ పేరుతో ఓ సినిమాను రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమాతో పాటు కరోనా వైరస్‌ పేరుతో మరో సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు. తాజాగా నేక్డ్‌ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను తెర మీదకు తీసుకురావటంతో పాటు టీజర్ రిలీజ్ చేశాడు.

ఈ రెండు ప్రాజెక్ట్‌లతో పాటు మరో రెండు ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు వర్మ. క్లైమాక్స్ సినిమా తన సొంత ప్లాట్‌ ఫాంలో సూపర్‌ హిట్ కావటంతో ఇదే నా కెరీర్‌కు ప్రారంభం అని భావిస్తున్నాను అని చెప్పాడు రామ్‌ గోపాల్ వర్మ. భవిష్యత్తులో కూడా ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలను తన ఆర్జీవీ వరల్డ్‌ థియటర్‌లో రిలీజ్ చేస్తానంటూ ప్రకటించాడు.