మూడేళ్ల క్రితం ఓ సారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ తీస్తానని ప్రకటించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పుడు మరోసారి కేసీఆర్‌ బయోపిక్‌ని ప్రకటించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM KCR) బయోపిక్ తీస్తానని ప్రకటించారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma). ఎప్పుడు కాంటవర్సియల్‌ కామెంట్లతో వార్తల్లో నిలిచే ఆయన ఈ మధ్య తన సినిమాలపై ఫోకస్‌పెట్టారు. ప్రస్తుతం ఆయన రూపొందించిన `డేంజరస్‌`(Dangerous Movie) అనే సినిమా విడుదలకు(ఏప్రిల్‌ 8) సిద్ధంగా ఉంది. చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రమోట్‌ చేస్తున్నారు. ఇప్పటికే బెంగుళూరు, చెన్నైలో ఈవెంట్లు నిర్వహించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

కేసీఆర్‌పై బయోపిక్‌ తీస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకి వర్మ స్పందిస్తూ, కచ్చితంగా కేసీఆర్‌ బయోపిక్‌ తీస్తానని తెలిపారు. కాకపోతే దానికి సమయం పడుతుందన్నారు. బయోపిక్‌లు ఈజీగా రావని, దాని వెనకాల ఎంతో రీసెర్చ్‌ చేయాలన్నారు. అయితే కేసీఆర్‌ జీవితంపై ఓ అవగాహన ఉందని, తీయడం ఈజీనే అని వెల్లడించారు. వర్మ గతంలోనే కేసీఆర్ బ‌యోపిక్ ను అనౌన్స్ చేశారు. `టైగ‌ర్ కేసీఆర్` పేరుతో బయోపిక్‌ తీయబోతున్నట్టు వెల్లడించారు. కానీ దీనికి సంబంధించిన అప్‌డేట్‌ లేదు. ఇప్పుడు మరోసారి బయోపిక్‌ గురించి ప్రస్తావించారు. మరి ఈ సారైనా తీస్తారా? మాటలకే పరిమితమవుతుందా? అనేది చూడాలంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే వర్మ రోజుకో సినిమాని ప్రకటిస్తుంటారు. కానీ అవి తెర వరకు రావడం లేదనేది ఆడియెన్స్ వాదన. 

ఇదిలా ఉంటే ఢిల్లీ ఈవెంట్‌లో ఆయన రూపొందించిన `డేంజరస్‌` సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు వర్మ. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సినిమా తీయాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు వర్మ. ఇద్ద‌రు అమ్మాయిల మ‌ధ్య స్నేహం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసింద‌నే క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని చెప్పారు. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమని సమాజాం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తుందన్నారు. ఇందులో అప్ప‌రారాణి, నైనా గంగూలీ లెస్బియ‌న్స్ పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఆయా పాత్రల్లో అద్భుతంగా నటించారని చెప్పారు ఆర్జీవీ.