కరోనా కారణంగా దర్శక నిర్మాతలంతా ఇంటికే పరిమితమవ్వగా ఆర్జీవీ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే లాక్‌డౌన్‌ క్లైమాక్స్ సినిమాను రిలీజ్‌ చేసిన వర్మ, ఈ నెల 27న నేక్డ్‌ పేరుతో మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో మరిన్ని సినిమాలను లైన్‌లో పెట్టాడు ఆర్జీవీ. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా మర్డర్ అనే సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశాడు వర్మ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య ప్రణయ్‌ హత్యోదంతం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ.

అయితే తన సినిమా పూర్తి అదే కథతో రూపొందటం లేదని, కేవలం ఆ సంఘటన ఇన్సిపిరేషన్‌తో సినిమా చేస్తున్నట్టుగా వర్మ క్లారిటీ ఇచ్చినా.. బయటకు వస్తున్న పోస్టర్లు  చూస్తుంటే మాత్రం వర్మ అమృత, ప్రణయ్‌, మారుతి రావుల కథతోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మంగళవారం మర్డర్ సినిమాకు సంబంధించి మరో రెండు పోస్టర్లను వదిలాడు వర్మ. బాధలో ఉన్న తండ్రిని, అదే సమయంలో నెగెటివ్‌ లుక్‌లో ఉన్న కూతురిని ఓ పోస్టర్‌లో చూపించాడు. ఈ ఫోటోను చూస్తే సినిమాలో అమృత పాత్రను నెగెటివ్‌ షేడ్‌లో చూపించబోతున్నాడా..? అనుమానాలు కలుగుతాయి.

అయితే వర్మ మాత్రం తాను ఏ పాత్రను నెగెటివ్‌గా చూపించటం లేదని చెపుతున్నాడు. అసలు చెడ్డ మనుషులు ఉండరు, చెడ్డ పరిస్థితుల కారణంగానే మనుషులు చెడ్డగా ప్రవర్తిస్తారిన అలాంటి సంఘటనలు మాత్రమే తాను మర్డర్‌ సినిమాలో చూపిస్తున్నానని చెప్పాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతుండగా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నట్టి కరుణ, నట్టి క్రాంతిలు నిర్మిస్తున్నారు.