మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని అభిమానులు ఎదురచూస్తున్న వేళ.. ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అఖిల్ తో ఆయన సినిమా చేస్తున్నారని, ఆ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోందని వినపడుతోంది. ఈ నేపధ్యంలో అఖిల్ తో సినిమా చేయాలని సుకుమార్ అనుకోవటం ఏమిటనే టాక్ బయలుదేరింది. అయితే సుకుమార్ ఈ నిర్ణయానికి రావటం వెనక ఓ స్టార్ హీరో రికమెండేషన్ ఉందంటున్నారు. అతను మరెవరో కాదు రామ్ చరణ్. 

అక్కినేని వారసుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా, ఇప్పటికీ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు అఖిల్. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్, వైవిధ్యమైన కథనాలు వండే విక్రమ్ కుమార్ కూడా అఖిల్‌కు సరైన సక్సెస్ ఇవ్వలేదు. ‘అఖిల్’, ‘హలో’ సినిమాల్లో ఈ కుర్రాడి యాక్టింగ్‌కు పెద్దగా పేరు రాలేదు. దీంతో ఆర్టిస్ట్ పొటెన్షియాలిటీని పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకునే సుకుమార్ డైరెక్షన్లో అఖిల్ నటిస్తే బాగుంటుందని రామ్ చరణ్ భావించి సెట్ చేసారని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ కు, అఖిల్ మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. 

దానికి తోడు అఖిల్ బ్రదర్ నాగ‌చైత‌న్య‌కి `100%ల‌వ్‌`తో ఓ మంచి విజయాన్నిచ్చాడు సుకుమార్‌. చైతూ యాక్టింగ్ స్టైల్‌ని కూడా మార్చేసిన చిత్ర‌మ‌ది. అఖిల్ కూడా ఈ ద‌శ‌లో సుకుమార్‌లాంటి ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తే బాగుంటుంద‌ని నాగార్జున భావించార‌ట‌. అఖిల్ - సుకుమార్ క‌ల‌యిక‌లో రూపొంద‌బోయే చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో పాటు, మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌బోతున్న‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.