రాంచరణ్ నటిస్తున్న RC15 చిత్రం విషయంలో చిత్ర యూనిట్ కి ఒక అంశం కలసి రానుంది. ఏపీ టికెట్ ధరల విషయంలో రాంచరణ్ మూవీ లాభపడనుంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC15 అనేది వర్కింగ్ టైటిల్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ స్టైల్ లో అవినీతి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు, బలమైన సందేశం, కథతో శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరోలని శంకర్ ఎంత పవర్ ఫుల్ గా చూపించగలరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో రాంచరణ్ లుక్ ఎలా ఉండబోతోంది.. ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఇప్పటి నుంచే మొదలైంది. ఈ చిత్రంలో రాంచరణ్ సివిల్ సర్వీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి 'సర్కారోడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.
ఇటీవలే ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని ఆ షెడ్యూల్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలసి వెకేషన్ వెళ్ళాడు. తిరిగి రాగానే చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. ఆ తర్వాత RC15 మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది.
ఇదిలా ఉండగా ఏపీలో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం వల్ల రాంచరణ్ అండ్ టీంకి కలిసొచ్చే అంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల ఎపి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో జరుపుకున్న చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. ఏపీలో షూటింగ్ జరుపుకోకుంటే నార్మల్ టికెట్ ధరలే వర్తిస్తాయి.
RC15 చిత్ర యూనిట్ కి ఈ విధంగా టికెట్ ధరల అంశం యాదృచ్చికంగా కలసి వచ్చింది అనే చెప్పాలి. ఇంకా కొంతభాగం షూటింగ్ ఏపీలో చిత్రికరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం ఏపీలోనే షూట్ చేయనున్నారు. అంటే ఖచ్చితంగా 20 శాతం షూటింగ్ ఏపీలోనే జరిగే అవకాశం ఉంది.
రాంచరణ్ కి జోడిగా ఈ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తోంది. వినయ విధేయ రామ తర్వాత మరోసారి వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
