కరోనా చిత్ర పరిశ్రమని ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇటీవల మెగా హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ కరోనాకి గురైన విషయం తెలిసిందే. దీంతో వారి సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఇప్పటికే వరుణ్‌ తేజ్‌ తనకు నెగటివ్‌ వచ్చిందని చెప్పారు. ఆయన సోమవారం `ఎఫ్‌3` షూటింగ్‌లోనూ జాయిన్‌ అయ్యారు. రామ్‌చరణ్‌ పరిస్థితేంటనేది అనుమానం నెలకొంది. తాజాగా ఆయన కూడా స్పందించారు. నెగటివ్‌ వచ్చిందని చెప్పారు. 

రామ్‌చరణ్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. `కోవిడ్‌-19 టెస్ట్ చేయించుకోగా, నాకు కరోనా నెగటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు వెయిట్‌ చేయలేకపోతున్నా. విషెస్‌ తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు రామ్‌చరణ్‌. గత పదమూడు రోజుల క్రితం తనకు వైరల్‌ సోకినట్టు రామ్‌చరణ్‌ ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఆందోళనకు గురయ్యారు. సరిగ్గా అప్పటికి నాలుగు రోజుల క్రితమే వారంతా క్రిస్మస్‌ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. కానీ లక్కీగా వారెవరికీ వైరస్‌ సోకలేదు. తమకు వైరస్‌ సోకిందని తెలియగానే చరణ్‌ హోమ్‌‌ క్వారంటైన్‌ అయిపోయారు. భార్యతో కలిసి కొన్ని రోజులు ఏకాంతంగా గడిపారు.

ప్రస్తుతం ఆయన `ఆర్‌ ఆర్‌ ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో హీరో. అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియ ముఖ్య పాత్రధారులుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో భారీ మల్టీస్టారర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. దాదాపు 80శాతానికిపైనే సినిమా షూటింగ్‌ పూర్తయినట్టు తెలుస్తుంది. త్వరలోనే మళ్లీ షూటింగ్‌ని మొదలు పెట్టనున్నారు.