చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సెట్‌లోకి అడుగుపెట్టారు. ఆదివారం రామ్‌చరణ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. `మా `సిద్ధ` సర్వం సిద్ధం` అంటూ దర్శకుడు కొరటాల శివ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా టెంపుల్‌ టౌన్‌ లొకేషన్‌లో రామ్‌చరణ్‌ అడుగుపెడుతున్నట్టుగా బ్యాక్‌ నుంచి తీసిన ఓ ఫోటోని పంచుకున్నారు. 

అలాగే చిత్ర బృందం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో రామ్‌చరణ్‌ `సిద్ధ` అనే పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. చెవికి రింగ్‌, మెడలో మాలతో కాషాయ రంగు షర్ట్ వేసుకుని కనిపిస్తున్నాడు రామ్‌చరణ్‌ చరణ్‌. దీంతో ఆయన పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ స్వామి మాలలో ఉన్న విషయం తెలిసిందే. ఇక చిరంజీవి సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌ రెడ్డి,రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్‌ టౌన్‌ సెట్‌ని వేశారు. ఇటీవల ఆ సెట్‌ వీడియో తీసి చిరంజీవి తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. అది కనువిందుగా ఉంటుందని వెల్లడించారు. ఇందులో చరణ్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం.