దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ దక్కించుకుంది. వసూళ్ల పరంగా కూడా తన సత్తా చాటుతోంది. సినీ ప్రముఖులు, విమర్శకుల నుండి ఈ సినిమాకి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇప్పటికే చాలా మంది సినిమా బాగుందని సోషల్ మీడియా వేదికంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఫేస్ బుక్ వేదికగా ఆయన సినిమాపై తన స్పందన తెలియజేశారు.

రామ్ అలానే ఇతర నటీనటులు ఎంతో ఎనర్జిటిక్ గా నటించారని.. పూరి గారికి అభినందనలు అని చెప్పారు. సినిమా కోసం పూరి ఎంతో చేశారని అన్నారు. ఈ పోస్ట్ చూసిన పూరి జగన్నాథ్ 'లవ్ యు చరణ్' అంటూ ధన్యవాదాలు తెలిపారు.

వరుస పరాజయాలతో డీలా పడ్డ పూరికి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా మంచి జోష్ ఇచ్చింది. మాస్ సెంటర్స్ లో ఈ సినిమా తన సత్తా చాటుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.