ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారమయ్యే ‘NO.1 యారి’ కార్యక్రమంలో రానాకు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు మంచు లక్ష్మి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్‌ మాట్లాడుతూ.. మీకు ఒక్కరోజు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే చేసే మొదటి పని ఏంటి? అని రానాను ప్రశ్నించింది. రానా స్పందిస్తూ.. విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. విద్య, వైద్యం ప్రజలకు సక్రమంగా అందిస్తే దేశం అంతా మారిపోతుందని తాను భావిస్తున్నానని రానా అన్నారు.  

ఇక నిజ జీవితంలో రాజకీయాలుకు దూరంగా ఉండే రానా..సినిమాలో మాత్రం పొలిటీషిన్ గా కనిపించారు. లీడర్‌, నేను రాజు  నేనే మంత్రి, ఎన్టీఆర్‌ కథా నాయకుడు, ఎన్టీఆర్‌ మహా నాయకుడు వంటి చిత్రాల్లో రానా పొలిటికల్‌ లీడర్‌గా కనిపించారు. ఆ పాత్రలకు మంచి పేరు సైతం వచ్చింది.  ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే.. రానా నటించిన ‘విరాటపర్వం’ చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్‌తో కలిసి ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌లో నటిస్తున్నారు. 

అలాగే ‘బాహుబలి’, ‘అరణ్య’ వంటి పాన్‌ ఇండియా చిత్రాల్లో నటించిన రానా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.    ఈ చిత్రాన్ని విశ్వశాంతి పిక్చర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా స్థాయిలో ఆచంట గోపీనాథ్‌, రాంబాబు సి.హెచ్‌ నిర్మించనున్నారు. దర్శకుడు, ఇతర తారాగణం, సాంకేతిక వర్గ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటిస్తోన్న చిత్రం (అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌) పూర్తవగానే ఈ ప్రాజెక్టులో అడుగుపెట్టనున్నారు రానా. ‘టాప్‌ హీరో’, ‘దేవుడు’, ‘అంజలి సీబీఐ’ తదితర చిత్రాలు విశ్వశాంతి పిక్చర్స్‌ బ్యానర్‌లోనే తెరకెక్కాయి.