టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమాలో నటిస్తోంది. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా సినిమాలో ఆమె సిగరెట్ కాలుస్తూ కనిపించిన సన్నివేశాల గురించి ప్రశ్నించారు. టీజర్ లో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా కనిపించడంతో నెటిజన్ల నుండి ఆమెకి వ్యతిరేకత ఎదురైంది.

అయితే సిగరెట్ కాల్చడం బోల్డ్ యాక్ట్ కాదని.. సినిమాలో రెండు, మూడు షాట్స్ మాత్రమే సిగరెట్ కాలుస్తూ కనిపిస్తానని.. నిజజీవితంలో తనకు అలవాటు లేదని చెప్పింది. అయినా హీరోలు కాల్చితే ఎలాంటి సమస్య ఉండదు కానీ హీరోయిన్ కాల్చితే అదొక పెద్ద టాపిక్ అయిపోతుందంటూ అసహనం వ్యక్తం చేస్తూ మాట్లాడింది. సిగరెట్ కాల్చడమనేది సాధారణ విషయమని.. రోడ్డు మీద కొంతమంది ఇలాంటి పనులు చేస్తే అసలు పట్టించుకోం.. అదే తెరపై నటులు చేస్తే మాత్రం తప్పుగా చూస్తారంటూ ఘాటుగా స్పందించింది.

ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ అన్ని పత్రికలూ వార్తలు ప్రచురించాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక కూడా ఈ వార్త రాసింది. దీంతో ఆ వార్తను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తూ ఫైర్ అయింది రకుల్.

''నేను ధూమపానం, మద్యపానం చేయను. కేవలం అవి అవంతిక(మన్మథుడు 2లో తన పాత్ర) అలవాట్లు! ఇది నటనలో భాగం. అవి రెండు ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. అటువంటి అలవాట్లను మన్మథుడు 2 ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. నా ఇంటర్వ్యూలో ఉన్న అసలు విషయాన్ని వదిలేసి వేరే విషయాలు ఎందుకు రాస్తారో నాకు అసలు అర్థం కాదు'' అంటూ మండిపడింది.