రీసెంట్ గా డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణను ఎదుర్కొన్న స్టార్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె తిరిగి సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. అందు నిమిత్తం ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ ఇందులో వ్యవసాయం చేసే పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నారట. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం ఉంది. 

ఇక ఈ సినిమా సెట్‌లో తీసిన వీడియోను రకుల్‌ సోషల్ ‌మీడియాలో షేర్‌ చేశారు. వర్షం కురుస్తున్నా షూటింగ్‌ ఆగలేదన్నారు. ‘వికారాబాద్‌లోని రాతి కొండలపై షూట్‌ చేస్తుండగా వర్షం మొదలైంది. వర్షం నుంచి కెమెరాలను కాపాడుకుంటున్నాం. కొవిడ్‌-19 సమస్యతో ఓ పక్క మనం ఇబ్బందిపడుతుంటే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు మరో అడ్డంకిగా మారాయి’ అని ఆమె పేర్కొన్నారు. వర్షంలోనూ చిత్ర టీమ్ సీన్ షూటి్ చేయటం ఆ వీడియోలో కనిపించింది.
 
ఇక రకుల్‌..నాగ్ సరసన ‘మన్మథుడు 2’లో గత ఏడాది తెలుగు తెరపై కనిపించారు. ఆ తర్వాత హిందీ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె  కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కాజల్‌, సిద్ధార్థ్‌ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.