లక్ష్మీస్ ఎన్టీఆర్ తో నిర్మాత రాకేష్ రెడ్డి సంచలనం సృష్టించారు. ఎన్ని వివాదాలు ఎదురైనా ఆ చిత్రాన్ని చివరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తర్వాత తాను భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మిస్తానని రాకేష్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తాజాగా రాకేష్ రెడ్డి రచయిత చిన్ని కృష్ణతో కలసి తిరుమలలో ఆసక్తికర ప్రకటన చేశారు. అర్జున్ రెడ్డిని మించేలా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. చిన్నికృష్ణ అద్భుతమైన కథ అందించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

త్వరలో నటీ నటులు, దర్శకుల వివరాలు ప్రకటిస్తాం అని చిన్నికృష్ణ మీడియాకు తెలిపారు. గురువారం రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాకేష్ రెడ్డి, చిన్నికృష్ణ ఈ ప్రకటన చేయడం విశేషం. 

ఇంద్ర, నరసింహ నాయుడు, గంగోత్రి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించిన చిన్ని కృష్ణ ఇటీవల కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్, చిరంజీవిపై వ్యాఖ్యలు చేసి మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు మళ్ళీ రచయితగా సినిమాలకు కథలు అందించేందుకు సిద్ధం అవుతున్నారు.