96 ఎన్నికల్లో తన వల్లే జయ ఓడిపోయిందన్న రజినీ గతంలో జయతో విబేధాలుండేవని చెప్పిన సూపర్ స్టార్ జయలలిత గురువును మించిన శిష్యురాలని కొనియాడిన తలైవా

1996 అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యాఖ్యలవల్లే జయలలిత నాయకత్వం వహించిన అన్నాడీఎంకే పార్టీ ఓటమిపాలైందని సినీ నటుడు రజనీకాంత్‌ అన్నారు. చెన్నైలో ఆదివారం నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత, నటుడు, రచయిత చో రామస్వామి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. జయలలితను తాను బాధపెట్టానని అందుకు బాధ పడుతున్నానని రజినీ అన్నారు.

ఈ సందర్భంగా నాటి ఎన్నికల సమయంలో తాను చేసిన తీవ్ర వ్యాఖ్యలను సూపర్‌స్టార్‌ గుర్తు చేసుకున్నారు. 1996లో జయలలితకు వ్యతిరేకంగా నిలిచానన్న విషయం తనను ఇప్పటికీ బాధపెడుతోందని రజనీ అన్నారు. జయలలిత మళ్లీ ఆధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడుకూడా రక్షించలేడని ఆ ఎన్నికల సందర్భంగా రజనీ వ్యాఖ్యానించారు.

కానీ ఇప్పుడు జయలలితను రజనీకాంత్‌ కోహినూర్‌ వజ్రంతో పోల్చారు. పురుషాధిక్య సమాజంలో అనేక ఆటుపోట్లకు ఎదురు నిలిచి జయ ఉన్నత శిఖరాలను అధిరోహించారని రజినీ కొనియాడారు. జయ ఎదుర్కొన్న సవాళ్లే ఆమెను సానపట్టిన వజ్రంలా మార్చాయని రజినీ అన్నారు. ఇరువురి మధ్య అప్పట్లో కొంత వివాదం ఉండేదని రజినీ చెప్పారు.

అయితే తన కుమార్తె వివాహానికి జయలలిత హాజరుకావడం తనని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని రజనీకాంత్‌ అన్నారు. కుమార్తె వివాహానికి జయలలితను ఆహ్వానించేందుకు ఎంతో గుబులుగా ఆమె అపాయింట్‌మెంట్‌ కోరానన్నారు. ఆమె కలుస్తారని ఊహించలేదన్నారు రజినీ. సాదరంగా ఆహ్వానించిన జయలలిత ఎటువంటి కార్యక్రమాలున్నా వివాహానికి తప్పకుండా హాజరవుతానని మాటిచ్చారని చెప్పారు.

జయలలిత నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. నటిగానూ, రాజకీయంగానూ తన గురువు, ఆరాధ్యదైవం ఎంజీఆర్‌ కంటే జయలలిత ఘటికురాలని పేర్కొన్నారు. తమిళనాట పురట్చి తలైవిగా ఎదిగి ప్రజల గుండెల్లో అమ్మగా చిరస్థాయిగా నిలిపోయారన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా 96లో రజినీకాంత్ పిలుపునిస్తే జయలలిత ఓడిపోయేంత సీన్ ఉండిందా అని తమిళ తంబీలు చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ సందర్భంగా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు జయలలిత, చో రామస్వామిలకు నివాళులర్పించారు. కార్యక్రమానికి నాజర్, విశాల్, కార్తీ, రాజశేఖర్, జీవిత, రోహిణి తదితరులు హాజరయ్యారు.