‘సూపర్‌ స్టార్‌’ రజనీకాంత్‌ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు.   శివ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి  ‘మన్నవన్’ అనే  టైటిల్ ని పెట్టారు.  ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీ నుంచి మొదలు కానుంది. అదీ హైదరాబాద్ లో కావటంతో త్వరలో రజనీకాంత్ ఇక్కడకు వస్తారు. ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్ వచ్చి, ఓ వారం పాటు క్వరైంటైన్ లో ఉంటారు ఆయన. ఆ తర్వాత షూట్ లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి చిత్ర టీమ్ త్వరలోనే అఫీషియల్ గా వెల్లడించనుందట. 

  ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర టీమ్ అనుకుంది కాని కరోనా దెబ్బకొట్టింది. దాంతో ఇప్పుడీ సినిమా షూట్ ని త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతికి థియోటర్ లో దింపాలని చూస్తున్నారు. సంక్రాంతికి కుదరకపోతే ఇక సమ్మర్ 2021లో రిలీజ్ చేస్తారు. ఇంతకీ మన్నవన్ అంటే అర్థం తెలుసా....? ‘కింగ్‌’!

ఇక ఈ చిత్రంలో ఒకప్పుడు వెండితెరపై స్టార్‌  హీరోయిన్స్ గా వెలిగిన  మీనా, ఖుష్బూలు రజనీతో కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇందులో కీర్తి సురేష్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక తెలుగులో శౌర్యం, శంఖం, దరువు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ... తమిళంలో 'సిరుతై' చిత్రం ద్వారా అడుగుపెట్టారు.

  సంక్రాంతి కానుకగా రజనీ-మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘దర్బార్‌’ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. శివ సినిమా తర్వాత లోకేశ్‌ కనకరాజు చిత్రంలో రజనీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేశ్‌ రజనీకి లైన్‌ చెప్పారని, అది తలైవాకు నచ్చడంతో స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నట్లు కోలీవుడ్‌ టాక్‌.