దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉండటంతో సామాన్యల నుంచి సెలబ్రెటీల వరకూ టెన్షన్ పడుతున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాట పరిస్దితి మరీ దారుణంగా ఉంది. ఈ నేపధ్యంలో రజనీకాంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే...
 
ఈ మధ్యనే రజినీకాంత్ ఇంటిని కూడా కరోనా వచ్చినట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత అది నిజం కాదని తెలిసి హమ్మయ్య అనుకున్నారు. అయితే తాజా సమాచారం మేరకు తమిళనాట కరోనా భయం ఎక్కువ కావడంతో రజినీకాంత్ చెన్నై తన సొంత ఇంటిని వదిలేసి, ఇంటికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నారని చెన్నై వర్గాల సమాచారం. 

మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ...రజనీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఒకరు కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యాడని తెలిసి.. పని మనుష్యులను కూడా రావొద్దని చెప్పి కేవలం ఇద్దరు పనిమనుషులకే అనుమతి ఇచ్చారని తెలుస్తోంది. అలాగని వారిని వదిలేయకుండా తీసేసిన మిగితా వారికి కూడా నెల నెలా జీతం ఇస్తున్నారట. ఇలా గత రెండు నెలల నుంచే జరుగుతోందని చెప్తున్నారు.

అంతేకాదు ప్రస్తుతం తాను ఉంటున్న ఫామ్ హౌస్‌ నుంచి ఎవ్వరైనా సరే బయటకు వెళ్లడం, బయటివాళ్ళు లోపలికి రావడం పూర్తిగా నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.అలాగే గ్రాసరీకి సంబంధించి కూడా ఏ పనివారినీ బయటకు పంపించకుండా, కేవలం ఫామ్ హౌస్‌లో పండిన కూరగాయాలనే తింటున్నారట. కరోనా పూర్తిగా వెళ్లిపోయే దాకా తిరిగి చెన్నై రావొద్దని, సినిమా షూటింగ్స్‌లో పాల్గొనని నిర్ణయించుకుని ఆ మేరకు తన వాళ్లకు తెలియచేసారట రజినీకాంత్.  గతంలో వచ్చిన అనారోగ్య సమస్యలతో మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ సూచించటంతో రజనీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందిట.