ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఎవరైనా సరే నోరు జారినా, మాట మార్చినా.. అటు ప్రత్యర్థుల నుంచి, ఇటు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. 

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఎవరైనా సరే నోరు జారినా, మాట మార్చినా.. అటు ప్రత్యర్థుల నుంచి, ఇటు నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన.. ఏపీ మంత్రి రోజా కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. అయితే ఇందుకు కారణం.. రజనీకాంత్‌కు సంబంధించి ఆమె అప్పట్లో, ఇప్పట్లో చేసిన వ్యాఖ్యలే కారణం. దీంతో పలువురు రజనీ అభిమానులు, తమిళ ప్రజలు.. రోజాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజాది రెండు నాలుకల ధోరణి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే.. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్.. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ మాటల వైసీపీ నేతలకు, అభిమానులకు రుచించలేదు. దీంతో రజనీకాంత్‌పై విమర్శల దాడికి దిగారు. అందరి సంగతి పక్కన పెడితే.. సినీ రంగానికే చెందిన మంత్రి రోజా కూడా రజనీకాంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రజనీకాంత్‌ను మనం పెద్ద స్థాయిలో ఊహించుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఆయన జీరో అయిపోయారు’’ అని విమర్శించారు. 

ఇన్నాళ్లూ సంపాదించిన పేరు పోగొట్టుకున్నాడని.. రాజకీయాలు వద్దనుకున్న రజనీకాంత్ మళ్లీ రాజకీయాలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. మరో రాష్ట్రానికి వెళ్లే కళాకారులు అక్కడి రాజకీయాల గురించి వ్యాఖ్యానించే ముందు అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని అంటూ సూచనలు కూడా చేశారు. 

Scroll to load tweet…

అయితే ఇది జరిగి నాలుగు నెలలు గడవకముందే.. రోజా ఫ్లేట్ ఫిరాయించారు. ఏపీలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించేందుకు రజనీకాంత్ తాజా చిత్రం జైలర్‌లోని డైలాగ్‌ను ఉదహరించారు. జైలర్ ఆడియో విడుదల కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘‘మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి’’ అని తమిళంలో చెప్పారు. చివరిలో తెలుగులో ‘‘అర్థమైందా రాజా?’’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా రోజా మాత్రం.. రజనీకాంత్‌ చెప్పిన డైలాగ్‌ను ప్రస్తావించి రాజకీయ ప్రత్యర్థులైన పవన్ కల్యాణ్‌, నారా లోకేష్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌కు ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటీవల నగిరిలో సీఎం జగన్ పాల్గొన్న బహిరంగ సభ వేదికగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘‘ఇటీవలే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి. ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండు లేరి ఊరే లేదు’’ అని అన్నారు. ఇదే డైలాగ్‌ను తమిళంలో కూడా చదివి వినిపించారు. 

Scroll to load tweet…

అయితే ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్న పలువురు.. రోజాది రెండు నాలుకల ధోరణి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వారికి నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరొలా ప్రొజెక్ట్ చేయడం వైసీపీ నేతలకు అలవాటేనని ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడు రజనీకాంత్ జీరో అయ్యారని విమర్శించిన రోజా.. ఇప్పుడు ఆయన డైలాగ్ ఎందుకు వాడుకున్నారని ప్రశ్నిస్తున్నారు. రజనీ ఆ డైలాగ్ చెప్పిందే వైసీపీ వాళ్ల కోసమని.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.