సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో కూతురు సౌందర్యకి వ్యాపారవేత్త విషాగన్ తో వివాహం జరపనున్నారు. నిన్న వీరి ప్రీవెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఈ రిసెప్షన్ నిర్వహించారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే ఈ వేడుకకు వచ్చిన వారందరికీ రజినీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రజినీకి ఇలా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన ఎలా వచ్చిందంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ ఆయనేం ఇచ్చారో తెలుసా.. ''సీడ్ బాల్స్''. తాంబూలం, పండ్లు, స్వీట్లతో పాటు ఇచ్చిన సంచుల్లో సీడ్ బాల్స్ చూసి ఆశ్చర్యపోయారట బంధువులు. ఆ విత్తనాలను 
నాటినా, లేక మట్టిలో పడేసినా కూడా మొక్కలు మొలుస్తాయట.

ఈ ఐడియా రజినీకాంత్ భార్య లతా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె తన ఆలోచన చెప్పగానే కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. పర్యావరణానికి మేలు జరిగే విధంగా ఇలా ఆలోచించినట్లు తెలుస్తోంది.