`జైలర్‌` సినిమాలో కాంట్రాక్ట్ విలన్‌.. రాయల్‌ ఛాలెంజ్‌ బెంగుళూరు జెర్సీ(టీషర్ట్) ధరించారు. అంతేకాదు అతను ఆ జెర్సీని ధరించి అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ కనిపిస్తారు.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన `జైలర్‌` మూవీ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం సుమారు ఆరు వందల కోట్ల వరకు కలెక్షన్లని రాబట్టింది. చాలా రోజుల తర్వాత రజనీకి సరైన బ్లాక్ బస్టర్‌ పడింది. తన రేంజ్‌ని చాటి చెప్పింది. దీనికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా జెర్సీ వివాదంలో ఇరుక్కుంది. 

సినిమాలో కాంట్రాక్ట్ విలన్‌.. రాయల్‌ ఛాలెంజ్‌ బెంగుళూరు జెర్సీ(టీషర్ట్) ధరించారు. అంతేకాదు అతను ఆ జెర్సీని ధరించి అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ కనిపిస్తారు. సినిమాలో ఈ సీన్‌ బాగా పేలింది. అదే సమయంలో విలన్‌ ధరించిన జెర్సీ కూడా హైలైట్‌ అయ్యింది. అదే వివాదానికి దారితీసింది. ఆ సమయంలో విలన్‌ ఆర్‌సీబీ జెర్సీ ధరించడంతో.. సదరు టీమ్‌ ఫ్రాంచైజీ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. తమ ప్రతిష్టకి భంగం కలిగించేలా ఆ సీన్‌ ఉందని, తమ అనుమతి లేకుండా ఆ జెర్సీని వాడటాన్ని వాళ్లు తప్పుపడుతూ కోర్ట్ ని ఆశ్రయించారు. ఆయా సన్నివేశాలను తొలగించాలని వారు కోర్ట్ కి వెల్లడించారు. జైలర్‌ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్ పై వాళ్లు కేసు పెట్టారు. 

ఇరువైపు వాదనలు విన్న ఢిల్లీ కోర్ట్ తమ తీర్పుని వెల్లడించింది. ఆయా సన్నివేశాలను మార్చాలని తెలిపింది. `ఆర్‌సీబీ` జెర్సీ లేకుండా చూడాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్‌సీబీ జెర్సీ సినిమాలో ఎక్కడ కూడా కనిపించకూడదని వెల్లడించింది. దీంతో సర్‌పిక్చర్స్ ప్రొడక్షన్‌ అందుకు ఒప్పుకుంది. కోర్ట్ తీర్పు, ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 1 వరకు ఆయా సీన్లు మార్చుతామని, ఆర్‌సీబీ కనిపించకుండా డిజిటల్‌గా మార్పులు చేస్తామని కోర్లుకి వెల్లడించింది. దీంతో ఈ కేసు ముగిసిపోయిందని చెప్పొచ్చు. 

ఇక రజనీకాంత్‌ హీరోగా శివరాజ్‌ కుమార్‌, మోహన్‌లాల గెస్ట్ లుగా నటించిన `జైలర్‌` చిత్రంలో తమన్నా కథానాయికగా నటించింది. సునీల్‌ కీలక పాత్రలో కనిపించారు. సన్‌ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్ట్ 10న ఈ చిత్రం విడుదలైంది. భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ ..సన్‌రైజ్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)కి యజమానిగా ఉన్న విషయం తెలిసిందే.