చావుబతుకుల్లో ఉన్న అభిమానికి తన వీడియో సందేశంతో ఆత్మస్థైర్యం   నింపే ప్రయత్నం చేశారు రజినీకాంత్. నీకు ఏమి కాదు, నీవు తప్పకుండా తిరిగి వస్తావు. నీవు కోలుకున్న వెంటనే కుటుంబంతో ఇంటికి రావాలి. నిన్ను నేను చూస్తాను, అని రజిని ఆసుపత్రి బెడ్ పై ఉన్న  అభిమానికి వీడియో సందేశం  పంపారు. ముంబైకి చెందిన మురళి అనే వీరాభిమానికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యపరిస్థితి విషమంగా మారింది. 

దీనితో సదరు అభిమాని ట్విట్టర్ ద్వారా రజనీకి ఓ సందేశం పంపారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేసి రానున్న 2021 ఎన్నికలలో ముఖ్యమంత్రిగా గెలవాలని, ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలని, పల్లెలను అభివృద్ధి చేయాలని కోరుకున్నారు. అలాగే రజిని సారథ్యంలో పనిచేస్తూ ప్రజలకు సేవ చేసే అవకాశం కోల్పోతున్నాని ఆయన ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. అభిమాని భావోద్వేగ సందేశానికి చలించిన రజిని వీడియో సందేశం ద్వారా, ఏమీ కాదు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తావని ధైర్యం చెప్పారు. 

ఓ అభిమాని పట్ల రజిని చూపించిన ఔదార్యానికి అందరూ భేష్ అంటున్నారు. అలాగే రజినీతో పాటు ఆయన అభిమానులు కూడా మురళి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. ఇక కరోనా కారణంగా రజిని షూటింగ్స్ లో పాల్గొనడం లేదు. ఐతే ఈ ఖాళీ సమయాన్ని రాజకీయ అరంగేట్రం, పార్టీ స్థాపన, దానిని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలు వంటి విషయాలను చర్చిస్తున్నారట. కాగా ప్రస్తుతం రజిని దర్శకుడు శివతో అన్నాత్తై అనే మూవీ చేస్తున్నారు.