హీరో రాజశేఖర్ కుటుంబం కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రాజశేఖర్  హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.కరోనా కారణంగా రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించింది. దీనితో ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక 'నాన్న కోవిడ్ తో పోరాడుతున్నారు.. ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేయండి' అని ఆమె సోషల్ మీడియాలో కోరగా అందరూ ఆందోళన చెందారు. 

 ఇక రాజశేఖర్ ఆరోగ్యం కొంచెం క్రిటికల్ గానే ఉందని, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ ఆరోగ్యం గురించిన వరుస కథనాల నేపథ్యంలో ఆయన భార్య జీవిత  స్పందించారు. మీడియా ద్వారా తాజా పరిస్థితి ఆమె తెలియజేశారు. కొన్ని అపోహలకు ఆమె చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. 

 జీవితా మాట్లాడుతూ... రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. త్వరగా కోలుకుంటున్నారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా కేరింగ్ తీసుకున్నారు. అందువల్ల రాజశేఖర్ గారు విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. రాజేశేఖర్ గారు వెంటిలేటర్ మీద ఉన్నారని ఓ వార్త ప్రచారం అవుతోంది. అది నిజం కాదు. ఆయన ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరు. నిజానికి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. అయితే వెంటిలేటర్ మీద మాత్రం లేరు. నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు చేసిన ప్రార్థనలు కారణంగానే రాజశేఖర్ గారు క్షేమంగా ఉన్నారు' అని వెల్లడించారు. 

జీవితా రాజశేకర్ మాటలు చూస్తుంటే ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా, పిల్లలు శివాని, శివాత్మిక త్వరగా కోలుకున్నారు. జీవితా రాజశేఖర్ కూడా కోలుకోవడం జరిగింది. రాజశేఖర్ మాత్రం కోవిడ్ తో పోరాడుతున్నారు.