మెగాస్టార్ చిరంజీవి, యాంగ్రీ హీరో రాజశేఖర్ ల మధ్య స్నేహం చిగురిస్తుందా.. గతంలో పలు కారణాలతో వీరి మధ్య నెలకొన్న విబేధాలు తొలగిపోయే అవకాశం వుందా.  గతంలో మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న చిరు, రాజశేఖర్ ల మధ్య గొడవలు సద్దుమణిగిపోయాయా... అంటే ప్రస్తుతానికి ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ వాతావరణమే ఉందని చెప్పాలి.

 

రాజశేఖర్ నటించిన 'పీఎస్వీ గరుడవేగ' నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ చిరంజీవిని ఇటీవలే కలిశానని, 'గరుడ వేగ' ట్రైలర్ బాగుందని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారని, సినిమా చూసేందుకు ఆయన్ని ఆహ్వానించానని చెప్పారు. చిరు ఆఫీసులో కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారని ఆయన తనతో చెప్పిన విషయాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

 

ఇక తనకు నిజంగా నచ్చితే చిరంజీవి సినిమాలో సైతం విలన్ రోల్ చేయడానికి తాను సిద్ధమని గతంలో చెప్పిన రాజశేఖర్... ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘ధృవ' సినిమాలో అరవిందస్వామి తరహా పాత్రలో అయితే తాను విలన్ రోల్ చేయడానికి సిద్ధమే అని రాజశేఖర్ అన్నారు.

అయితే గతంలో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య విబేధాలు తారా స్థాయిలో వుండేవనేది మీడియా సాక్షిగా చూసిందే. చిరంజీవి హీరోగా నటించిన ‘ఠాగూర్' మూవీ తమిళ హిట్ మూవీ ‘రమణ'కు రీమేక్. వాస్తవానికి ఈ చిత్రం రీమేక్ హక్కులు రాజశేఖర్ దక్కించుకుని నటించాలనుకున్నారు.. కానీ చిరంజీవి ఆ సినిమా తనకు దక్కకుండా చేశారనే కోపం గతంలో రాజశేఖర్ లో ఉండేది. అంతేకాక హిందీ హిట్ మూవీ ‘దబాంగ్' చిత్రాన్ని కూడా రాజశేఖర్ దక్కించుకోవాలన చూశారని, అయితే పవన్ కళ్యాణ్ ఆ చిత్రం హక్కుల్ని ఎగరేసుకెళ్లారని టాక్. అందుకే ఇలా సినిమా రంగానికి సంబంధించిన విషయాలే వీరి మధ్య గతంలో విబేధాలకు దారి తీసాయని, తర్వాత రాజకీయ కారణాలు తోడయ్యాయని అప్పట్లో చర్చ జరిగేది.

 

అంతేకాక మెగాస్టార్ అభిమానులు చేసిన అల్లరిపై చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికెళ్లి పరామర్శించారు. అప్పట్లో గొడవలు సద్దుమణిగాయో లేదో తెలిసిందే. అయితే అదంతా గతం. కానీ ప్రస్థుతం మాత్రం రాజశేఖర్ స్వయంగా తన ‘పిఎస్వీ గరుగవేగ' సినిమా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి సినిమా చూడటానికి వస్తే వీళ్ల మధ్య మళ్లీ స్నేహబంధం మళ్లీ మొదలైనట్లే అనే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.