యాంగ్రీ హీరో రాజశేఖర్ తాజాగా నటించిన కల్కి చిత్రం కల్కి థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని దర్శకుడు. తాజాగా రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజశేఖర్ విలన్ పాత్రలో నటిస్తారు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఈ యాంగ్రీ హీరో క్లారిటీ ఇచ్చారు. 

కల్కి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని రాజశేఖర్ అన్నారు. తన లుక్స్, ప్రశాంత్ వర్మ టేకింగ్ బావుందంటూ ప్రశంసలు దక్కుతున్నట్లు రాజశేఖర్ పేర్కొన్నారు. విలన్ పాత్రల్లో నటించడానికి సిద్దమేనా అని ప్రశ్నించగా.. నేను రెడీ అంటూ సమాధానం ఇచ్చారు. నేను విలన్ పాత్రలో నటించడానికి సిద్దమే.. కానీ నేను విలన్ అయితే తట్టుకోలేరు. అందుకే నన్ను చూసి భయపడుతున్నారేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. 

సాధారణంగా కమర్షియల్ చిత్రాల్లో ఉండే విలన్ పాత్రలు చేయను. ఉదాహరణకు 'ధృవ' సినిమా తరహాలో అరవింద స్వామి చేసిన పాత్రలైతే చేస్తా. ఇటీవల తనకు శ్రీమంతుడు, అరవింద సమేత చిత్రాల్లో జగపతి బాబు నటించిన పాత్రలు కూడా నచ్చాయని రాజశేఖర్ అన్నారు. 

కొంత కాలంగా బాలయ్య, రాజశేఖర్ కలసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి ప్రశ్నించగా.. బాలయ్యతోనే కాదు.. చిరంజీవితో కలసి నటిస్తానని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకుంటా అంటూ రాజశేఖర్ సరదాగా వ్యాఖ్యానించారు.