మిస్సమ్మలో కమెడియన్ గా ఎందుకు చేశారు... రాజమౌళి ప్రశ్నకు ఏఎన్నార్ సమాధానం!
ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో మాట్లాడిన రాజమౌళి ఆసక్తికర విషయం బయటపెట్టారు. స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఏఎన్నార్ మిస్సమ్మలో కమెడియన్ రోల్ చేయడానికి గల కారణాలు ఏమిటో బయటపెట్టారు...

నేడు లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు అన్నపూర్ణ స్టూడియోలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, జయసుధ, మురళీ మోహన్, బ్రహ్మానందం, మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన రాజమౌళి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. అప్పటికే స్టార్ గా ఎదిగిన ఏఎన్నార్ మిస్సమ్మ చిత్రంలో కమెడియన్ రోల్ చేయడానికి కారణం బయటపెట్టారు. ''ఏఎన్నార్ గారి చిత్రాలు చూస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ పెరిగాను. అయితే వ్యక్తిగతంగా అనుబంధం లేదు. ఒక ఈవెంట్ కి ఆయనతో పాటు నేను కూడా హాజరయ్యాను. కార్యక్రమం మొదలు కావడానికి సమయం ఉంది. ఏఎన్నార్ నేను ఒక గదిలో వెయిట్ చేశాము.
అప్పుడు దేవదాసు చిత్రంతో స్టార్ అయిన మీరు మిస్సమ్మ లో కమెడియన్ రోల్ ఎందుకు చేశారని ఏఎన్నార్ ని అడిగాను. నేను కావాలని అడిగి మరీ ఆ పాత్ర చేశాను అన్నారు. చక్రపాణి, నాగిరెడ్డి నాకు అత్యంత సన్నిహితులు. కథ విన్నప్పుడు కామెడీ రోల్ నేను చేస్తాను అన్నాను. నీ ఫ్యాన్స్ కొడతారయ్యా అని వాళ్ళు అన్నారు. కాదు నాకు అన్నీ తాగుబోతు పాత్రలు వస్తున్నాయి. ఈ ఇమేజ్ నుండి బయటపడాలంటే మిస్సమ్మలో కామెడీ రోల్ చేయాల్సిందే అన్నాను. అందుకే మిస్సమ్మలో ఆ పాత్ర చేశాను అని ఏఎన్నారు చెప్పారు.
ఒక స్టార్ హీరో సినిమాలో తాను స్టార్ అయ్యాక కూడా అలాంటి పాత్ర చేయడానికి ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాగే కుటుంబాన్ని వృత్తిని వేరువేరుగా చూడాలని ఆయన తెలియజేశారు. ఇలా అనేక విషయాల్లో మనకు స్ఫూర్తిగా నిలిచారు. జీవం ఉట్టిపడేలా ఆయన శిల్పాన్ని రూపొందించిన శిల్పులకు ధన్యవాదాలు... అని రాజమౌళి ప్రసంగం ముగించారు...
మిస్సమ్మ ఆల్ టైం టాలీవుడ్ క్లాసిక్ గా నిలిచింది. ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు, అల్లు రామలింగయ్య వంటి లెంజెడ్స్ ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ఏఎన్నార్ కామెడీ డిటెక్టివ్ రోల్ చేశారు. మిస్సమ్మ చిత్రానికి ఎల్ వి ప్రసాద్ దర్శకుడు.