`ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఇంకా ప్రశంసలు, అవార్డులు దక్కుతూనే ఉన్నాయి. తాజాగా దర్శకుడు రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌ అవార్డు వరించింది. 

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళికి మరో గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి సంబంధించి ఉత్తమ దర్శకుడి అవార్డు వరించింది. న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌ పురస్కారాన్ని రాజమౌళి అందుకున్నారు. 88వ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌ లో రాజమౌళిని బెస్ట్ డైరెక్టర్‌ అవార్డుతో గౌరవించారు. ఈ అవార్డు స్వీకరణ కార్యక్రమంలో రాజమౌళితోపాటు ఆయన భార్య రమా రాజమౌళి కూడా పాల్గొనడం విశేషం. 

ఈ సందర్భంగా రాజమౌళి అవార్డులను ఉద్దేశించి మాట్లాడారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` విశేషాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పలువురు సినీప్రముఖులు రాజమౌళికి అభినందనలు తెలియజేస్తున్నారు. రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటించిన విషయం తెలిసిందే. తెలుగు సాయుధ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ పాత్రల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు రాజమౌళి. 

Scroll to load tweet…

స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు వాళ్లు చేసిన పోరాటం నేపథ్యంలో సాగే చిత్రమిది. తమ గోండు బిడ్డ కోసం కొమురం భీమ్‌, తమ మన్యం జనాలకు తుపాకులు ఇవ్వాలనే లక్ష్యంతో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ వారిపై చేసిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది మార్చి 25న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1150కోట్లు వసూలు చేసింది. 

సినిమాకి ఇతర దేశాల నుంచి విశేష ఆదరణ లభించింది. ఫిల్మ్ సెలబ్రిటీలు, మేకర్స్ దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో అవార్డు పంట పండుతుంది. వరుసగా అంతర్జాతీయ అవార్డులు వరిస్తున్నాయి. ఇప్పటికే ఆస్కార్‌ బరిలో ఉంది `ఆర్‌ఆర్‌ఆర్‌`. సాంగ్స్, నటులు, దర్శకుడు విభాగాల్లో ఆస్కార్ వరించే అవకాశం ఉందంటున్నారు. వీటితోపాటు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు కూడా దక్కే ఛాన్స్ ఉంది.