ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (రౌద్రం.రణం.రుధిరం) సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు.లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు‌. డాక్టర్ల సూచన మేరకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ఉంటుందని ఇప్పటికే జక్కన్న చెప్పారు. 70 శాతం వరకూ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 5 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తాజా సమాచారం. ఈ షెడ్యూల్ లో ముందుగా ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే మరో హీరో రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసినప్పటికీ, ఎన్టీఆర్ టీజర్ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. దీంతో ఆ టీజర్ రిలీజ్ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని సన్నివేశాలను ముందుగా ఎన్టీఆర్ పై  తీస్తారని అంటున్నారు.     

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్‌చరణ్‌ సరసన బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ సందడి చేయనున్నారు. అలాగే కొమరం భీమ్‌గా మెప్పించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఓలీవియా మోరీస్‌ నటించనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, నటి శ్రియ అతిథి పాత్రల్లో మెరవనున్నారు. 

‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ రాశారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌, శ్రియ అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.