దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'మగధీర' సినిమా నుండి 'బాహుబలి 2' వరకు అతడితో కలిసి పని చేస్తోన్న కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ ఇప్పుడు నిర్మాతగా మారి సినిమా తీస్తున్నాడు. సైంటిఫిక్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'ఆకాశవాణి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. డెబ్యూ డైరెక్టర్ అశ్విన్ గంగారాకు ఈ సినిమాను డైరెక్ట్ 
చేస్తున్నాడు.

రాజమౌళి కుటుంబం ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సినిమా విషయంలో మొదటి నుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. సినిమా షూటింగ్ అరుకు ప్రాంతంలో జరిగినప్పుడు రాజమౌళి స్వయంగా అక్కడకి వెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో చూసుకొని వచ్చారు. కొన్ని నెలల క్రితమే సినిమా షూటింగ్ మొత్తం 
పూర్తయింది.

ఎడిటెడ్ వెర్షన్ కూడా సిద్ధం చేశారు. కానీ సినిమా ఫైనల్ కట్ చూసిన తరువాత రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేశారట. కథ ప్రకారం సినిమాలో విలన్ పాత్ర ఎంతో కీలకం. ఆ పాత్ర చుట్టూనే సినిమా నడుస్తుంది. ఈ పాత్ర కోసం ఓ కొత్త నటుడిని తీసుకున్నారు. తెరపై ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం రాజమౌళికి నచ్చలేదట. అందుకే మరో నటుడిని తీసుకొచ్చి రీప్లేస్ చేశారు.

అందుకు సంబంధించిన సన్నివేశాలన్నీ రీషూట్ చేసుకుంటూ వెళ్లారు. ఇప్పటికి షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. నిజానికి ఆగస్ట్ లోనే సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ రీషూట్ కారణంగా ఆలస్యమయింది. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు  తీసుకురానున్నారు.