Asianet News TeluguAsianet News Telugu

Rajamouli about RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` పునాది రహస్యం చెప్పిన జక్కన్న.. కలెక్షన్ల నెంబర్‌ ఆలోచిస్తారట

 నేషనల్‌ మీడియా టార్గెట్‌గా రాజమౌళి ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రారంభానికి కారణమేంటో తాజాగా తెలిపారు రాజమౌళి. 

rajamouli open up rrr movie story starting secret
Author
Hyderabad, First Published Dec 26, 2021, 6:50 AM IST

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ అంచనాలు పెంచడంతో సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రం జనవరి 7న భారీగా విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు జక్కన్న టీమ్‌. ముంబయిలో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. నేషనల్‌ మీడియా టార్గెట్‌గా రాజమౌళి ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రారంభానికి కారణమేంటో తాజాగా తెలిపారు రాజమౌళి. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` పునాది ఎలా పడిందనేది ఓపెన్‌ అయ్యారు. తాను ఎలాంటి ఆలోచనలు చేస్తాడో తెలిపారు. `నేను ఏం చెప్పినా ఓకే చేస్తారు. నా సినిమాలో ఎవరైనా నటిస్తారు` అనే భావనకు వస్తే అదే నా పతనానికి నాంది అని నేను భావిస్తాను. అలాంటి ఆలోచన నాలో లేదు. బిగినింగ్‌ నుంచి రెండు పవర్‌ఫుల్‌ పాత్రలతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది. మనకు దుర్యోధనుడు–కర్ణుడు, కృష్ణుడు–అర్జునుడు స్నేహితులని తెలుసు. కానీ, కృష్ణుడు–దుర్యోధనుడు ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది అనేది నా ఆలోచన.  

అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే `ఆర్‌ఆర్‌ఆర్‌` అని, అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ ఆలోచన వచ్చినప్పుడు చరణ్‌, తారక్‌ అయితే నా పాత్రకు న్యాయం చేయగలరని నమ్మకం కలిగింది. మా మధ్య మంచి స్నేహం ఉంది. కథలో ఉన్న ఉత్సాహమే రెండున్నర సంవత్సరాలుగా ఈ జర్నీ ఇలా సాగేలా చేసింది` అని చెప్పారు.  బడ్జెట్‌, కలెక్షన్ల గురించి చెబుతూ, `డబ్బు కోసమే సినిమాలు చేస్తాం. మనం పెట్టుబడి పెట్టిన డబ్బు రాకపోతే అది ఒక ఫెయిల్యూర్‌గా లెక్క. కష్టం మొత్తం వృథా అయినట్టే. సినిమా తెరకెక్కిస్తున్న రోజుల్లో నాకు ఎప్పుడూ బడ్జెట్‌ ఆలోచన రాదు. ఎప్పుడో ఒకసారి ఖర్చు ఎంత అయ్యిందని చూస్తా. విడుదల తర్వాత నంబర్స్‌ గురించి ఆలోచిస్తా` అని తెలిపారు. 

రాజమౌళి ఇంకా చెబుతూ, `భావోద్వేగం ఉంటే ఏ సీన్‌ అయినా కచ్చితంగా పండుతుందని నమ్ముతా. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో కూడా ప్రతి ఫ్రేమ్‌లో ఒక ఎమోషనల్‌ కనెక్ట్‌ ఉంటుంది. `నాటు నాటు` పాట మాస్‌ డ్యాన్స్‌ నంబర్‌ అనుకుంటారు. అది డ్యాన్స్‌ నంబర్‌ మాత్రమే కాదు, అందులో  ఒక ఎమోషన్‌ ఉంటుంది. విడుదల అయ్యాక ప్రేక్షకులే ఆ విషయాన్ని చెబుతారు. ప్రతి సన్నివేశానికి నాలో ఒక ఆలోచన ఉంటుంది. ఎవరైనా సరిగ్గా చేయకపోతే నా ఆలోచనకు తగినట్టు సీన్‌ రాదేమోనని  భయపడుతుంటాను` అని చెప్పారు రాజమౌళి.
 

Follow Us:
Download App:
  • android
  • ios