తెలుగులో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్‌ చిత్రం `ఆర్‌ ఆర్‌ ఆర్‌`. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కరోనా లాక్‌డౌన్‌ మరింతగా ఇబ్బంది పెట్టింది. దాదాపు ఎనిమిది నెలలు షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ లోపు షూటింగ్‌ జరిగితే ఇప్పటికే షూటింగ్‌ పూర్తయ్యేది. 

లాక్‌ డౌన్‌ మరోసారి సినిమాని వాయిదా వేసింది. ఇక అనుకున్న టైమ్‌ లోనే పూర్తి చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లేట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నారు రాజమౌళి టీమ్‌. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్‌ జరుపుతున్నారు. వణికే చలిని కూడా లెక్క చేయకుండా రాత్రి సమయాల్లో కూడా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ చిన్న వీడియోని పంచుకుంది టీమ్‌. ఇందులో చలికి వణుకుతున్నా కూడా షూటింగ్‌ లో పాల్గొన్నట్టు తెలిపారు. 

ఇందులో కెమెరామెన్‌, రాజమౌళితోపాటు ఎన్టీఆర్‌ కూడా ఉన్నారు. వీడియో చివర్లో ఆయన తళుక్కున మెరిశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.