రాజమౌళి- మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ ఇంటర్య్వూలో రాజమౌళినే ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ క్షణం నుంచే ఈ సినిమాపై ఫ్యాన్స్ ఈ చిత్రం గురించి డిస్కషన్స్ మొదలెట్టేసారు. నేపథ్యం ఏదైనా విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తనదైన ముద్ర వేసే రాజమౌళి.. మహేష్‌ బాబుతో ఎలాంటి కథ తెరకెక్కించనున్నారు, ఎప్పుడు మొదలెడతారు అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది.  తాజాగా దానికి సమాధానం దొరికినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాని  దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారట.

నవంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఇప్పటికే దాదాపు స్క్రిప్టు వర్క్ పూర్తి చేసిన టీమ్ ఈ సినిమాకి అవసరమైన సెట్స్ స్కెచెస్ గీయించే బాధ్యతలను కూడా రాజమౌళి అప్పగించేయడం జరిగిందని చెబుతున్నారు.  2023 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారని చెప్పుకుంటున్నారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ కథను రాస్తున్నారు. తండ్రీతనయులు ఈసారి డ్రామాల్ని పక్కన పెట్టి మహేష్‌ కోసం ఎవరూ ఊహించని స్ర్కిప్టును సిద్ధం చేస్తున్నారట.

అడవి నేపథ్యంలో సాగే భారీ బడ్జెట్‌ సినిమా అని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో యాక్షన్ సీన్స్  తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు భారతీయ చిత్రపరిశ్రమ చూడని ఫారెస్ట్‌ యాక్షన్‌ ఎడ్వెంచర్‌ అని టాక్‌. మరో ప్రక్క  ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు చెప్పుకుంటున్నారు. మహేశ్ బాబు శివాజీ పాత్రకి సరిగ్గా సరిపోతాడని అంటున్నారు. అయితే కథ అదేనా? కాదా? అనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
 
 లాక్‌డౌన్‌ సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్టుపై విజయేంద్ర ప్రసాద్‌, రాజమౌళి చాలా కసరత్తులు చేశారని, 2022లో సెట్స్‌పైకి వెళ్లనుందని ఆంగ్ల మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.  ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మహేష్‌ విషయానికొస్తే.. పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు.