ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైనా అనుకుంటే వదిలే రకం కాదని, ఆయనకి దొరకకుండా ఆరు నెలలు తప్పించుకొని తిరిగానని చెప్పుకొచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి.

అసలు విషయంలోకి వస్తే.. గతేడాది అమరావతి నిర్మాణ విషయంలో చంద్రబాబు నాయుడు రాజమౌళిని సంప్రదించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడిన రాజమౌళి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

''రాజధాని నిర్మాణ విషయమై చంద్రబాబు గారు నన్ను సంప్రదించినప్పుడు ఆరు నెలల పాటు తప్పించుకొని తిరగడానికి ప్రయత్నించాను. ఆర్కిటెక్చర్ గురించి నాకేం తెలియదు. అలాంటిది నన్ను ఎందుకు సంప్రదిస్తున్నారో నాకు అర్ధం కాలేదు. కానీ చంద్రబాబు ఏదైనా అనుకుంటే వదిలే రకం కాదు. ఇక కలవక తప్పలేదు.

చివరకి లండన్ లో ఉన్న ఆర్కిటెక్ లకు వారధిగా పని చేశాను. నేనొక డిజైన్ సూచించాను కానీ అది ఫైనల్ కాలేదు. అప్పటికే రెడీగా ఉన్న ఒక డిజైన్ ని ఓకే చేశారు. కానీ బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని చెప్పిన నా సలహాని వాళ్లు కూడా ఆమోదించారు'' అంటూ వెల్లడించారు.