సాహో చిత్రం అనుకున్న విధంగానే ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. దాదాపు 10 వేల స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ నటించిన ఈ యాక్షన్ చిత్రానికి ఎంతలా డిమాండ్ ఉందో అని. 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం, బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

కానీ సాహో చిత్రం పూర్తిస్థాయిలో ప్రేక్షకులని సంతృప్తి పరిచే విధంగా లేదని అంటున్నారు. మార్నింగ్ షోల నుంచే డివైడ్ టాక్ మొదలయింది. కమర్షియల్ గా ఈ చిత్ర ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సాహో చిత్రంపై అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారు. 

ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించి ఉంటే ప్రభాస్ స్థానం బాలీవుడ్ లో పదిలమై ఉండేది. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తెరకెక్కించి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడం అంత ఆషామాషీ విషయం కాదు. ఆ ఘనత సౌత్ లో ఇద్దరు దర్శకులకు మాత్రమే దక్కింది. వారే శంకర్, రాజమౌళి. శంకర్ అపరిచితుడు, రోబో లాంటి చిత్రాలని పాన్ ఇండియా లెవల్లో తీసుకువెళ్లి ఘనవిజయం సాధించారు. 

ఇక రాజమౌళి బాహుబలితో ఇటు సౌత్ తో పాటు హిందీలో కూడా సంచనలం సృష్టించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఏర్పడ్డ ఇమేజ్ ని సాహో దర్శకుడు సుజీత్ వినియోగించుకోవడంలో విఫలమయ్యాడని అంటున్నారు. రాజమౌళి, శంకర్ చేసేది ఒకటే.. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఓ కథని ఎంచుకుని దానిని తమ దర్శకత్వంతో అద్భుతంగా తెరకెక్కిస్తారు. 

బాహుబలి సక్సెస్ ని సాహో కొనసాగించలేకపోయింది కాబట్టి మరోసారి అందరి చూపు రాజమౌళిపై పడింది. రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రోబో సీక్వెల్ 2.0 తో నిరాశపరిచిన శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

బాహుబలి ఇచ్చిన ధైర్యంతోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన సైరా చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ చిత్రాన్ని నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగా విజయం సాధించింది. ప్రస్తుతం కెజిఎఫ్ 2 తెరకెక్కుతోంది.