Rajadhani Files Movie : అమరావతి రైతుల సినిమా ‘రాజధాని ఫైల్స్’ నిలిపివేత.. ఎందుకంటే?
‘రాజధాని ఫైల్స్’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కానీ అర్ధాంతరంగా నిలిపోయింది. అమరావతి రైతుల కష్టాలపై చిత్రీకరించిన ఈ సినిమాను రెవెన్యూ అధికారులు వచ్చి అడ్డుకున్నారు.
ఏపీలోని అమరావతి రైతులు రాజధానుల పోరాటం ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘రాజధాని ఫైల్స్’ (Rajadhani Files). అమరావతిలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని దాదాపు ఐదేళ్లుగా పోరాటం జరుగుతూనే ఉంది. అమరావతి రైతులకు, ప్రభుత్వానికి ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. త్వరలో ఎన్నికలు వస్తున్న తరుణంలో అక్కడి రైతుల కష్టాలను చూపించే కోణంలో దర్శకుడు భాను Bhanu ‘రాజధాని ఫైల్స్’గా సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 15న (ఇవ్వాళ) థియేటర్లలో విడుదలైంది. కానీ ఉన్నట్టుండి మళ్లీ నిలిపివేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్ లో సినిమాను మధ్యలోనే రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. టిక్కెట్ కొనుక్కొని మరి సినిమాను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రదర్శనను రద్దు చేశారు. దీంతో ఆడియెన్స్, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకే సినిమాను నిలిపి వేసినట్టు చెప్పారు. దాంతో ఆర్డర్ కాపీని చూపించాలని కోరారు.
అలాగే గుంటూరు జిల్లా ఉండవల్లిలో కూడా సినిమాను నిలిపివేశారు. దీంతో రైతులు, టీడీపీ నేతల తో కలిసి అక్కడి రామక్రిష్ణ థియేటర్ ముందు ధర్నాకు దిగారు. సినిమాను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రంలో అఖిలన్ (పరిచయం), వీణ (పరిచయం), వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, విశాల్ పట్నీ, షణ్ముఖ్, మధు, అజయరత్నం, అమృత చౌదరి, అంకితా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ సంగీతం అందించడం విశేషం.