ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని చిరంజీవి రిజెక్ట్ చేశాడన్న వార్త టాలీవుడ్ లో అతి పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతటి సక్సెస్ఫుల్ సిరీస్ చిరంజీవి వదులుకుని తప్పు చేశాడన్న వాదన మొదలైంది.
భోళా శంకర్ ఫెయిల్యూర్ చిరంజీవిని(Chiranjeevi) విమర్శలపాలు చేసింది. ఇలాంటి చెత్త రీమేక్స్ ఎందుకు ఎంచుకుంటున్నారు? డైరెక్ట్ మూవీస్ చేయండంటూ ఆయనకు అభిమానులు కూడా సలహాలు ఇచ్చారు. నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనే సందిగ్ధంలోకి భోళా శంకర్ నెట్టేసింది. సబ్జెక్ట్స్ ఎంచుకోవడంలో చిరంజీవి ఫెయిల్ అవుతున్నాడన్న ఆరోపణల మధ్య నిర్మాత అశ్వినీ దత్ కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి.
''ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) సిరీస్ రాజ్ అండ్ డీకే చిరంజీవి కోసం సిద్ధం చేశారు. ఖైదీ 150 చిత్రంతో హిట్ కొట్టిన ఉన్న చిరంజీవి... భార్య, పిల్లలు ఉన్న తండ్రి పాత్ర చేయను అన్నారు. అవసరమైతే చిల్డ్రన్ పార్ట్ తీసేద్దామని రాజ్ డీకే చెప్పారు. అయినా చిరంజీవికి ఎందుకో ఎక్కలేదు. ఆయన పక్కన పెట్టేశారు'' అని అశ్వినీ దత్ అన్నారు. చిరంజీవి చేసుంటే ది ఫ్యామిలీ మ్యాన్ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది అన్నారు. నిజానికి ఇది షాకింగ్ న్యూస్. కారణం మనోజ్ బాజ్ పాయ్ తప్ప మరొకరు చేయలేరు అన్నంతగా ఆ రోల్ ఆయనకు కుదిరింది. ఇది చిరంజీవి కోసం రాసిన స్క్రిప్ట్ అంటే నమ్మలేం.
అయితే అశ్వినీ దత్ చేప్పే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. కనీసం గాసిప్ గా కూడా వినిపించలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ ట్రెమండస్ సక్సెస్ తర్వాత కూడా ఈ స్క్రిప్ట్ చిరంజీవి రిజెక్ట్ చేసిన విషయం రాజ్ అండ్ డీకే ఎక్కడా చెప్పలేదు. పైగా వారు డైరెక్ట్ చేసిన గన్స్ అండ్ గులాబ్స్ సిరీస్లో చిరంజీవిపై అభిమానం చాటుకున్నారు. ఓ సన్నివేశంలో చిరంజీవి ఓల్డ్ సాంగ్ రిఫరెన్స్ గా వాడారు.
అయితే చిరంజీవి నటిస్తే రాజ్ అండ్ డీకేకి (Raj and DK)అంత స్వేచ్ఛ ఉండేది కాదేమో. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో యాక్షన్ కి మించి ఫ్యామిలీ డ్రామా, హ్యూమర్ హైలెట్. చిరంజీవి ఉంటే కిడ్స్ రోల్స్ ఉండేవి కాదని అశ్వినీ దత్ కామెంట్స్ తో తెలుస్తుంది. కూతురు, కొడుకుతో మనోజ్ సన్నివేశాలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచాయి. అంటే సెన్సిబుల్, టైమింగ్ కామెడీ మిస్ అయ్యేవాళ్ళం. చిరంజీవి లాంటి నటుడితో భార్యపై అనుమానం, దానితో కూడిన ఫ్రస్ట్రేషన్ వంటి అంశాలు టచ్ చేయలేం. స్టార్ ఇమేజ్ లేని మనోజ్ భాజ్ పాయ్ తో ది ఫ్యామిలీ మ్యాన్ రోల్ సూపర్ సక్సెస్. అండర్ కవర్ ఆఫీసర్ అయిన మిడిల్ క్లాస్ ఫాదర్ గా మనోజ్ బాజ్ పాయ్ సహజంగా నటించారు. చిరంజీవితో చేస్తే అక్కర్లేని కమర్షియల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ తో కిచిడి అయ్యే ఛాన్స్ ఉంది.
దీని వలన చెప్పాలనుకున్న పాయింట్ పక్కకు పోయి రిజల్ట్ తేడా కొట్టొచ్చు. ఇటీవల ఇదే తరహా విశ్లేషణ జరిగింది. పుష్ప మూవీ వదులుకున్న మహేష్ జాతీయ అవార్డు కోల్పోయారన్న వాదన తెరపైకి వచ్చింది. పుష్ప మూవీ మహేష్ చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుందని చెప్పలేం. ఒక సక్సెస్ఫుల్ మూవీ ఎవరు చేసినా హిట్ అయితే ప్రతి రీమేక్ విజయం సాధించాలి. అలా జరగడం లేదు. కాబట్టి ది ఫ్యామిలీ మాన్ సిరీస్ చిరంజీవి వదిలేసి తప్పు చేశాడనుకోవడం కరెక్ట్ కాదనే వాదన ఉంది.
రాజ్ అండ్ డీకే అచ్చ తెలుగు డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ కి బాలీవుడ్ సెట్ అయ్యింది. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్స్, ఫార్జీ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ప్రస్తుతం సమంతతో సిటాడెల్ చేస్తున్నారు. ఇది పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.
