సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం మహర్షి ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం రోజు విజయవాడలో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. మహేష్ బాబుతో పాటు మహర్షి చిత్ర యూనిట్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇక మహేష్ ని హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు అతిథిగా ఈ సక్సెస్ మీట్ కు హాజరయ్యారు. 

రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. వంద చిత్రాలు చేసినప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందో.. మహేష్ బాబు 25 చిత్రాలు పూర్తి చేసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎంత సంతోషం కలిగి ఉంటుందో.. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అంత సంతోషంగా ఉందని రాఘవేంద్ర రావు మహేష్ ని ఉద్దేశించి తెలిపాడు. రాఘవేంద్రరావు ఈ మాట చెప్పగానే మహేష్ బాబు లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు. 

దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రంలో రైతుల సమస్యలపై మంచి సన్నివేశాలు రూపొందించారని రాఘవేంద్ర రావు ప్రశంసించారు. మే 9 తన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. మహానటి కూడా అదే తేదీన విడుదలయింది. ఇప్పుడు మహర్షి చిత్రం ఆ సెంటిమెంట్ ని కొనసాగించింది అని రాఘవేంద్ర రావు అన్నారు.