సారాంశం

మరోసారి రాఘవ లారెన్స్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆమె కూడబెట్టుకున్న డబ్బుకు చెదలు పట్టి పాడైపోయింది అని తెలిసి లారెన్స్ సహాయం చేశారు. 

లక్ష రూపాయలు ఇచ్చిన లారెన్స్ : నటుడు, దర్శకుడు, డాన్స్ మాస్టర్, నిర్మాత.. ఇలా బోలెడు ప్రతిభ ఉన్న లారెన్స్ సినిమాల్లో నటించడమే కాదు, తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  చాలా మంది పేదవాళ్ళకి సాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పేదింటి ఆడపిల్లకి చేసిన సాయం అందరి మనసులను గెలుచుకుంది.

కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు ..

శివగంగ జిల్లాలోని సుక్కనాంపట్టికి చెందిన ముత్తుకరుప్పికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ముత్తుకరుప్పి, ఆమె భర్త కూలీలు. పిల్లలకి బంగారు కమ్మలు వేయించడానికి డబ్బులు దాచుకుంటున్నారు. డబ్బులను డబ్బాలో పెట్టి, ఇంట్లోనే ఒక గుంత తవ్వి దాచారు.

లక్ష రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు

డబ్బాలో లక్ష రూపాయలు దాచారు. వర్షాలకి డబ్బాలోకి నీళ్ళు వెళ్లి, చెదలు పట్టి డబ్బులన్నీ పాడైపోయాయి. కొన్ని రోజుల తర్వాత డబ్బాను తెరిచి చూస్తే ముత్తుకరుప్పికి పిడుగు పడ్డట్లయింది. డబ్బులన్నీ చిరిగిపోయాయి. ఏం చేయాలో తోచక ఏడ్చేసింది.

పాడైన డబ్బులను చూసి ముత్తుకరుప్పి ఏడ్చిన వీడియో నెట్ లో వైరల్ అయింది. శివగంగ జిల్లా కలెక్టర్ ఈ విషయం తెలుసుకుని, ఆ డబ్బులను రిజర్వ్ బ్యాంక్ ద్వారా మార్చుకునేలా సాయం చేశారు.

లారెన్స్ దేవుడిలా వచ్చాడు

ఈ విషయం తెలుసుకున్న లారెన్స్, తన సంస్థ ద్వారా ముత్తుకరుప్పికి సాయం చేయాలనుకున్నాడు. ఆమెను చెన్నైకి పిలిపించి, పోయిన డబ్బులను తిరిగి ఇచ్చాడు. లారెన్స్ ఇచ్చిన డబ్బులు తీసుకుని ముత్తుకరుప్పి కన్నీళ్ళతో కృతజ్ఞతలు చెప్పిన వీడియో నెట్ లో వైరల్ అవుతోంది.