రజనీకాంత్, చిరంజీవిలతో సినిమా.. రాఘవ లారెన్స్ సంచలన వ్యాఖ్యలు..
సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలతో సినిమాలు చేయడంపై రాఘవ లారెన్స్ ఓపెన్ అయ్యారు. ఆయన చేసిన కామెంట్ హాట్ టాపిక్ అవుతుంది.

రాఘవ లారెన్స్ డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. నటుడిగా ఎదిగారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన లారెన్స్ ఇప్పుడు స్టార్ హీరోగా, స్టార్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఇటీవల `చంద్రముఖి2` చిత్రంతో పరాజయాన్ని చవి చూసిన లారెన్స్ ఇప్పుడు మరో సీక్వెల్‌తో వస్తున్నారు. కల్ట్ క్లాసిక్‌గా హిట్ అయిన `జిగర్‌తాండ` కి సీక్వెల్‌గా ఇప్పుడు `జిగర్‌తాండ డబుల్ ఎక్స్` చిత్రం రాబోతుంది. ఈ నెల 10న మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కాబోతుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేశాడు లారెన్స్. ఈ సందర్బంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రజనీకాంత్, చిరంజీవిలతో సినిమాలు చేయడంపై స్పందించారు. తన ప్రతి సినిమాకి రజనీకాంత్ ఆశీస్సులు తీసుకునే లారెన్స్.. ఆయనతో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా, ఆయనతో సినిమా చేయడానికి కథలు రెడీగానే ఉన్నాయి. కానీ దేనికైనా టైమ్ రావాలి. రాఘవేంద్రస్వామి అనుగ్రహం ఉండాలి, అన్ని కలిసి రావాలి అప్పుడే సినిమా చేయగలం. లేదంటే బలవంతంగా సినిమా చేయాలని కూర్చుంటే ఫ్లాప్‌లే పడతాయి. గతంలో నా విషయంలో అదే జరిగింది, అందుకే తొందర పడటం లేదు అని తెలిపారు లారెన్స్.
మరోవైపు తెలుగులో చిరంజీవి, నాగార్జునలతో సినిమాలు ఎప్పుడు చేస్తారని అడగ్గా తాను సిద్ధమే అని, కథలు ఉన్నాయన్నారు. కానీ దేనికైనా టైమ్ రావాలి అని తెలిపారు. కానీ ఏదో రోజు వాళ్లు అవకాశం ఇస్తే కచ్చితంగా చేస్తానని చెప్పారు. రజనీకాంత్, చిరంజీవి కలిసి సినిమా చేయడానికి కూడా తన వద్ద కథలున్నాయని తెలిపారు. అయితే తనకు హీరోగా ఆఫర్లు వస్తున్నాయని, తీరిక లేకుండా ఉన్నానని అందుకే డైరెక్షన్ సైడ్ వెళ్లడం లేదన్నారు. అయితే దర్శకత్వం వహించాల్సి వస్తే తాను `కాంచన`కి సీక్వెల్ తీస్తానని తెలిపారు.
`చంద్రముఖి2` సినిమా ఫెయిల్యూర్‌పై రియాక్ట్ అవుతూ, కథ చెప్పినప్పుడు బాగుందని, కానీ తెరపైకి వచ్చాక మరోలా మారిందన్నారు. అయితే ఓ దర్శకుడిగా ఏ సినిమా ఎలా వచ్చిందో షూటింగ్ టైమ్‌లోనే తెలుస్తుందని, అందుకే సైలెంట్‌గా ఉంటామని తెలిపారు. అయితే `చంద్రముఖి2` విషయంలో తాను హ్యాపీ అని, తనకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చాయని, నిర్మాతలకు డబ్బుల వచ్చాయని చెప్పడం గమనార్హం.